కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఇక పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి రాడు: బండి సంజయ్

కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఇక పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి రాడు: బండి సంజయ్
  • పంట చేతికొచ్చే సమయానికి ఫారెస్టోళ్లను ఉసిగొల్పుతుండు
  • బాలింతను కూడా అరెస్టు చేసిన దుర్మార్గుడు కేసీఆర్ అని ఫైర్
  • నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన కేంద్ర మంత్రి అర్జున్ ముండా, సంజయ్

ఆదిలాబాద్, వెలుగు: కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మళ్లీ అధికారంలోకి రారని బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్ అన్నారు. రుణమాఫీ, నిరుద్యోగ భృతి, దళిత బంధు సహా ఎన్నో హామీలిచ్చారని, ఈ బడ్జెట్‌‌‌‌‌‌‌‌లోనైనా వాటికి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి మాట నిలబెట్టుకోవాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా జాతర ఆదివారం ప్రారంభమైంది. కేంద్ర మంత్రి అర్జున్ ముండా, బండి సంజయ్.. నాగోబా ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వీరికి గిరిజన సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. అటవీ అధికారులకు, గిరిజనులకు మధ్య సీఎం కేసీఆర్ కొట్లాట పెడుతున్నారని, పంట చేతికొచ్చే సమయానికి ఫారెస్ట్ అధికారులను ఉసిగొల్పుతారని, ఆయన మాత్రం ఫామ్‌‌హౌస్‌‌లో కూర్చుంటారని బండి సంజయ్ మండిపడ్డారు. ఖమ్మంలో బాలింతలు, పసిపిల్లలని చూడకుండా జైలుకు పంపిన మూర్ఖుడు కేసీఆర్ అని ఫైరయ్యారు. తండాలను గ్రామ పంచాయతీలను చేసి ఇప్పటికీ అదనంగా పైసా ఇచ్చిన దాఖలాల్లేవని విమర్శించారు. పైగా పంచాయతీలకు కేంద్రం నేరుగా నిధులు పంపితే.. సర్పంచులకు తెలియకుండా ఆ నిధులను దొంగలా దోచుకున్నారని ఎద్దేవా చేశారు. ‘‘ప్రశ్నించే వాళ్లను ఎలా ఇబ్బంది పెట్టాలి? ఎలా కేసులు పెట్టాలి.. పోరాడుతున్న బీజేపీ నేతలను ఎట్లా బదనాం చేయాలి.. వాళ్ల పిల్లలను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలన్నదే కేసీఆర్ యోచన. ప్రజల గురించి పట్టించుకోరు’’ అని అన్నారు.

గిరిజనులకు ఇండ్లు ఎందుకు కట్టిస్తలే

ప్రధాని నరేంద్ర మోడీ లక్షలాది ఇండ్లకు నిధులిస్తే.. గిరిజనులకు ఎందుకు ఇండ్లను నిర్మించడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి 2.40 లక్షల ఇండ్లు ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటిదాకా కేసీఆర్ ఇచ్చిన హామీలపై అసెంబ్లీ వేదికగా సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలు పవిత్రంగా జరుపుకునే నాగోబా జాతరలో కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని, ప్రత్యేక నిధులు కేటాయించకుండా గిరిజనుల జాతరను విస్మరించారని మండిపడ్డారు. గిరిజనులంటేనే కేసీఆర్ కు చులకనని, ఆదివాసీ బిడ్డ రాష్ట్రపతి కాకుండా ఓడించేందుకు కుట్ర చేశారని ఫైరయ్యారు. పోడు భూములకు పట్టాలిస్తానని మాట తప్పిన కేసీఆర్.. ముస్లిం రిజర్వేషన్లతో ముడిపెట్టి గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అమలు కాకుండా కుట్ర చేశారని మండిపడ్డారు.

ఆదివాసీలను ఎందుకు పట్టించుకుంటలే

తెలంగాణ ప్రజలను రాచిరంపాన పెట్టిన నిజాం వారసుడు పరాయి దేశంలో చనిపోతే హైదరాబాద్‌‌కు తీసుకొచ్చి అత్యున్నత అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్న కేసీఆర్.. ఆదివాసీలను ఎందుకు పట్టించుకోవడం లేదని బండి సంజయ్​ ప్రశ్నించారు. జోడేఘాట్‌‌కు రూ.100 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చి మాట తప్పారని, నాగోబా ఆలయ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారన్నారు. మెస్రం వంశీయులే తలా రూ.5 వేలు, 10 వేల చొప్పున విరాళాలు సేకరించి ఆలయాన్ని నిర్మించుకోవడం అభినందనీయమన్నారు. ‘‘ఈ జిల్లాలో మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు లేవు. ఆసుపత్రుల్లేవు. కాళేశ్వరం పేరుతో దోచుకుతిన్నారు. పోడు భూముల సమస్య తీవ్రంగా ఉంది. కుర్చీ వేసుకుని పట్టాలిస్తానన్న కేసీఆర్ పత్తా లేకుండా పోయారు. ఇప్పుడు ఎలక్షన్ల సమయంలో మరోసారి ఆదివాసీలను మోసం చేసేందుకు సిద్ధమవుతున్నారు’’ అని మండిపడ్డారు. నరేంద్ర మోడీ కేబినెట్‌‌లో 8 మంది ఎస్టీలకు చోటు కల్పించడం గిరిజనులపై బీజేపీకి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ నినాదాన్ని వాడుకుని.. ఇప్పుడు ‘జై తెలంగాణ’ అని కూడా అనని ద్రోహి కేసీఆర్‌‌‌‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఒక్కసారి బీజేపీకి అవకాశమిస్తే.. నాగోబా జాతరను దేశం గర్వించేలా, గిరిజన జాతి అబ్బురపడేలా ఘనంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, కొమురం భీం మనవడు సోనేరావు, ఆలయ కమిటీ చైర్మన్ తుకారాం, బీజేపీ నాయకులు మోహన్ రావు పటేల్, సుహాసిని రెడ్డి, కంది శ్రీనివాస్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి తదితరులు ఉన్నారు.

అడవులకు దూరం చేస్తున్రు: సోయం బాపురావు

రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీలను అడవులకు దూరం చేసే కుట్ర చేస్తున్నదని ఎంపీ సోయం బాపురావు మండిపడ్డారు. పొడు భూముల విషయంలో అటవీ శాఖ అధికారులు ఆదివాసీలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. జీవో నంబర్ 3 విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలకు అండగా ఉంటుందన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఆదివాసీల బతుకులు మారడం లేదన్నారు. 2,500 మందికి పోడు పట్టాలు ఇవ్వాలని ఉమ్మడి రాష్ట్రంలో సర్వే చేసి ప్రకటించారని, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కరికి కూడా పట్టాలు ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంపై ఒత్తిడి తీసుకురావాలని కేంద్ర మంత్రిని కోరారు. సర్కార్ ఆదివాసీలపై జులుం చూపిస్తూ కేసులు పెడుతున్నదని, ఫారెస్టు అధికారులను ఉసిగొల్పుతున్నదని మండిపడ్డారు. 

ప్రపోజల్ పంపిస్తే నిధులిస్తం : కేంద్ర మంత్రి అర్జున్​ ముండా

నాగోబా ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇందుకు సంబంధించిన ప్రపోజల్ రెడీ చేసి కేంద్రానికి పంపిస్తే నిధులు మంజూరు చేస్తామని కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా చెప్పారు. నాగోబా దర్బార్ హాల్‌‌లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఆలయాన్ని దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అడవికి రారాజులు ఆదివాసీలేనని, ఈ ప్రభుత్వం ఒకవేళ పట్టించుకోకుంటే వచ్చే బీజేపీ ప్రభుత్వమే సమస్యలు తీరుస్తుందని భరోసా ఇచ్చారు.