కేసీఆర్​కు ఓటమి భయం అందుకే ముందస్తు హడావుడి: వివేక్​ వెంకటస్వామి

కేసీఆర్​కు ఓటమి భయం అందుకే ముందస్తు హడావుడి: వివేక్​ వెంకటస్వామి
  • కుటుంబ, అవినీతి పాలనను అంతం చేయాలి
  • టీఆర్​ఎస్​ను ఓడించే సత్తా బీజేపీకే ఉంది

మంచిర్యాల, వెలుగు : కేసీఆర్​కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ముందస్తు ఎన్నికలకు రెడీ అవుతున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్​ వెంకటస్వామి అన్నారు. అవినీతి, కుటుంబ పాలనను అంతం చేయడానికి కార్యకర్తలు రెడీగా ఉండాలన్నారు. మంచిర్యాలలోని ఖండేల్​వాల్​ భవన్​లో మంగళవారం నిర్వహించిన బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశానికి వివేక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎప్పుడూ ఫామ్​హౌస్​లో పడుకునే కేసీఆర్..​ ఇటీవల జిల్లాల్లో పర్యటిస్తూ హడావుడి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో రోజురోజుకు బీజేపీ బలపడుతుండడంతో ఆయనకు ఓటమి భయం పట్టుకుందన్నారు. ఎన్నికలు వస్తేనే కేసీఆర్​కు ప్రజలు గుర్తొస్తారని, అవి అయిపోగానే ఇచ్చిన హామీలను, జనాన్ని మర్చిపోతారని విమర్శించారు. టీఆర్ఎస్​ను ఓడించే సత్తా బీజేపీకే ఉందని, మునుగోడులో అధికార దుర్వినియోగం చేసి కోట్ల రూపాయలు వెదజల్లడంతోనే టీఆర్ఎస్  గట్టెక్కిందన్నారు. ఇన్​చార్జులుగా ఉన్న చోట  తక్కువ ఓట్లు వస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వనని కేసీఆర్ బెదిరించడంతోనే ఎమ్మెల్యేలు, నాయకులు భారీగా ఓట్లు కొనుగోలు చేశారన్నారు. అవినీతి పాలనతో విసిగిపోయిన జనం బీజేపీ వైపు చూస్తున్నారని, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పార్టీలోకి రావడానికి ఉత్సాహం చూపుతున్నారన్నారు.  టీఆర్ఎస్ నాయకుల అరాచకాలపై ధైర్యంగా పోరాడాలని, అక్రమ కేసులకు భయపడొద్దని సూచించారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సమావేశంలో జిల్లా ఇన్​చార్జి పల్లె గంగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు ముల్కల్ల మల్లారెడ్డి, పోనుగోటి రంగారావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు రజినీశ్​జైన్, అందుగుల శ్రీనివాస్, మునిమంద రమేష్, నాయకులు ఆరుముల్ల పోశం, మున్నారాజ్​ సిసోడియా, నగునూరి వెంకటేశ్వర్​గౌడ్  తదితరులు పాల్గొన్నారు.

టీఆర్​ఎస్​ సర్కారు ఫెయిల్​

హామీలు అమలు చేయడంలో టీఆర్ఎస్ సర్కారు పూర్తిగా ఫెయిలైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు విమర్శించారు. సింగరేణి విషయంలో టీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. రూల్స్​కు విరుద్ధంగా కేసీఆర్​ ఇప్పటికే సింగరేణిలో 50 శాతం మంది కాంట్రాక్టు, ఔట్​సోర్సింగ్ కార్మికులను నియమించారన్నారు. బొగ్గు బ్లాకులను తన కుటుంబ సభ్యులకు అప్పగించేందుకే  వేలంలో సింగరేణి పాల్గొనకుండా కుట్రలు చేస్తున్నారన్నారు.