అసెంబ్లీ రద్దు దిశగా కేసీఆర్‌‌ అడుగులు

అసెంబ్లీ రద్దు దిశగా కేసీఆర్‌‌ అడుగులు
  • అసెంబ్లీ రద్దు దిశగా కేసీఆర్‌‌ అడుగులు
  • ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలతో బిజీబిజీ
  • త్వరలోనే ఎన్నికలొస్తాయంటున్న బీజేపీ, కాంగ్రెస్‌‌
  • ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు పార్టీలు సన్నద్ధం

హైదరాబాద్‌‌, వెలుగు:  రాష్ట్రంలో మళ్లా ముందస్తు ఎన్నికల ముచ్చట మొదలైంది. అసెంబ్లీ రద్దు దిశగా  కేసీఆర్​ అడుగులు వేస్తున్నారనే చర్చ జరుగుతున్నది. త్వరలోనే రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయని, ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు తాము రెడీగా ఉన్నామని  బీజేపీ, కాంగ్రెస్‌‌  పదే పదే చెప్తున్నాయి. సీఎం కేసీఆర్‌‌ కొన్నిరోజులుగా బీఆర్​ఎస్​ పార్టీ వ్యవహారాల్లో దూకుడు పెంచడంతో పాటు పాత ఫైళ్లను ముందరేసుకుంటున్నారు. దీంతో ప్రజలను ఎన్నికల మూడ్‌‌లోకి తీసుకువస్తున్నారు. 2018లోనూ కేసీఆర్‌‌ ఇదే రీతిగా వ్యవహరించి అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఈసారి కూడా 2018  స్ట్రాటజీనే ఫాలో అవుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయని పొలిటికల్‌‌ సర్కిల్స్‌‌లో చర్చ సాగుతున్నది. కేబినెట్‌‌ తీర్మానంతో అసెంబ్లీని రద్దు చేద్దామా..? లేక, ఆరు నెలల్లోగా అసెంబ్లీని సమావేశ పర్చకుండా టెక్నికల్‌‌గానే రద్దయ్యేలా చేద్దామా..? అనే రెండు ఆప్షన్లను కేసీఆర్​ పరిశీలిస్తున్నట్లు లీడర్లు చెప్తున్నారు. నిరుడు డిసెంబర్‌‌ రెండో వారంలో అసెంబ్లీని సమావేశ పరిచి కేంద్రం విధానాలపై చర్చిస్తామని అదే నెల మొదటి వారంలో సీఎంవో నుంచి ప్రెస్‌‌నోట్‌‌ రిలీజ్‌‌ చేశారు. అయితే, జనవరి మూడో వారం ముగిసినా అసెంబ్లీ సమావేశాల ముచ్చట్నే  లేదు. అసెంబ్లీ సెషన్‌‌పై ఇప్పుడు కేసీఆర్‌‌ మౌనం వహించడం వెనుక కూడా ఏదో వ్యూహం దాగుందని రాజకీయవర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. 


రాష్ట్ర అసెంబ్లీ నిరుడు సెప్టెంబర్‌‌‌‌13న చివరిసారిగా సమావేశమైంది. ఆ రోజు నుంచి ఆరు నెలల్లోపు (అంటే.. మార్చి 12లోపు) అసెంబ్లీని సమావేశ పరచుకుంటే  అసెంబ్లీ ఆటోమేటిక్‌‌‌‌గా రద్దవుతుంది.  దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇట్లా రద్దు కాలేదని నిపుణులు చెప్తున్నారు. ఒకవేళ అట్లా అసెంబ్లీ రద్దయితే తర్వాతి పరిణామాలను కూడా పాలకపక్షం ఎదుర్కోవడానికి సిద్ధపడాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో అలాంటి పరిస్థితి తలెత్తకపోవచ్చనే చర్చ సాగుతున్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న సీఎం కేసీఆర్‌‌‌‌.. గవర్నర్‌‌‌‌ తమిళిసై ప్రసంగం లేకుండానే 2022 -–23 వార్షిక బడ్జెట్​ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. గవర్నర్‌‌‌‌ ప్రసంగం పెట్టాల్సి వస్తుందనే 2021 సెప్టెంబర్‌‌‌‌ నుంచి అసెంబ్లీని ప్రొరోగ్‌‌‌‌ చేయలేదు. 2021 సెప్టెంబర్‌‌‌‌ 24 నుంచి అక్టోబర్‌‌‌‌ 8 వరకు (ఏడు రోజుల పాటు) జరిగిన రెండో అసెంబ్లీ ఎనిమిదో సెషన్‌‌‌‌కు కొనసాగింపుగానే నిరుడు సెప్టెంబర్​లో సమావేశాలు నిర్వహించారు.  ఎనిమిదో సెషన్‌‌‌‌ లో మూడు సార్లు అసెంబ్లీ సిట్టింగ్‌‌‌‌ నిర్వహించారు. రెండో సిట్టింగ్​2022  మార్చి 7 నుంచి 15 వరకు (ఏడు రోజులపాటు), మూడో సిట్టింగ్​ సెప్టెంబర్​ 6, 12, 13 తేదీల్లో జరిగింది. ఇప్పుడు మళ్లీ అసెంబ్లీ సమావేశ పరిస్తే దానిని నాలుగో సిట్టింగ్‌‌‌‌గా పరిగణిస్తారు.

హడావుడిగా పనులు

మునుగోడు ఉప ఎన్నిక నాటి నుంచే రాష్ట్రంలో పొలిటికల్‌‌‌‌ హీట్‌‌‌‌ పెరిగింది. మొత్తం ప్రభుత్వాన్ని, పార్టీని మోహరించినా, కమ్యూనిస్టులు కలిసి వచ్చినా ముక్కిమూలిగి బీఆర్​ఎస్​ అభ్యర్థి గెలిచారు. మునుగోడు తరహాలోనే రాష్ట్రం మొత్తం ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి చేదాటి పోతుందని కేసీఆర్‌‌‌‌ ముందస్తు దిశగా అడుగులు ప్రారంభించినట్లు చర్చ నడుస్తున్నది. ఇందులో భాగంగానే పాలనలో వేగం పెంచారని, వరుసగా కలెక్టరేట్లు ఓపెన్‌‌‌‌ చేస్తూ అన్ని జిల్లాలకు వరాలు కురిపిస్తున్నారని లీడర్లు అంటున్నారు. వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి యువతలో ఉన్న అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్న టీచర్ల బదిలీలకు గ్రీన్‌‌‌‌ సిగ్నల్‌‌‌‌ ఇచ్చారు. రైతు రుణ మాఫీని పూర్తి చేసే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు ప్రభుత్వవర్గాలు చెప్తున్నాయి. కంటి వెలుగు ప్రోగ్రాం మొదటి విడతను 2018 ఆగస్టులో కేసీఆర్ ప్రారంభించారు. ఆ తర్వాత నెలకు  అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఇప్పుడు రెండో విడత కూడా కంటి వెలుగును ప్రారంభించారు. ఇది కూడా ముందస్తుకు సంకేతమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పైగా తన పుట్టిన రోజైన ఫిబ్రవరి 18న సెక్రటేరియట్‌‌‌‌ ఓపెనింగ్‌‌‌‌కు కేసీఆర్​ ముహూర్తం ఫిక్స్‌‌‌‌ చేశారు. కానీ అప్పటి వరకు పనులు పూర్తవడం అనుమానమేనని అధికారులే చెప్తున్నారు. ముందస్తు ఎన్నికల కోసమే హడావుడిగా ఓపెనింగ్‌‌‌‌కు ముహూర్తం పెట్టారనే చర్చ సాగుతున్నది. బుధవారం ఖమ్మంలో సభ నిర్వహించి బీఆర్​ఎస్​ శ్రేణుల్లో జోష్‌‌‌‌ పెంచేందుకు కేసీఆర్​ ప్రయత్నించారు. 2018లోనూ కొంగరకలాన్‌‌‌‌లో పార్టీ ప్లీనరీ నిర్వహించి అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు వెళ్లారు. ఈసారి ఫిబ్రవరిలో మరో బహిరంగ సభ పెట్టి పార్టీ మొత్తాన్ని ఎన్నికలకు సమాయత్తం చేసే యోచనలో కేసీఆర్‌‌‌‌ ఉన్నారనే ప్రచారం జరుగుతున్నది. సెక్రటేరియట్‌‌‌‌ ఓపెనింగ్‌‌‌‌ అనంతరం ఓట్‌‌‌‌ ఆన్‌‌‌‌  అకౌంట్‌‌‌‌ బడ్జెట్‌‌‌‌ కోసం అసెంబ్లీని సమావేశపరిచి, ఆ తర్వాత అసెంబ్లీని రద్దు చేయొచ్చన్న చర్చ కూడా నడుస్తున్నది. షెడ్యూల్‌‌‌‌ ప్రకారం ఈ ఏడాది డిసెంబర్​లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ప్రతిపక్షాలు బలం పుంజుకోవడానికి టైం ఇచ్చినట్టు అవుతుందని, అందుకే కేసీఆర్‌‌‌‌ ముందస్తుకు వెళ్లాలనుకుంటున్నారని రాజకీయ నిపుణులు అంటున్నారు. 

ఇవి సంకేతాలేనా?

కంటి వెలుగు ప్రోగ్రాం మొదటి విడతను 2018 ఆగస్టులో కేసీఆర్​ ప్రారంభించారు. ఆ తర్వాత నెలకు (సెప్టెంబర్​ 6న) అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఇప్పుడు రెండో విడత కంటి వెలుగును ప్రారంభించడం ద్వారా మళ్లీ ముందస్తు ఎన్నికలకు సంకేతమిచ్చారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
తన పుట్టినరోజైన ఫిబ్రవరి 17న సెక్రటేరియెట్‌‌ ఓపెనింగ్‌‌కు కేసీఆర్​ ముహూర్తం ఫిక్స్‌‌ చేశారు. ప్రారంభోత్సవం నాటికి సెక్రటేరియట్‌‌ నిర్మాణ పనులు పూర్తవడం అనుమానమేనని అధికారులే చెప్తున్నారు. అయినా.. ముందస్తు ఎన్నికల కోసమే హడావుడిగా సెక్రటేరియెట్‌‌ ఓపెనింగ్‌‌కు ముహూర్తం పెట్టారనే చర్చ సాగుతున్నది. 
బుధవారం ఖమ్మంలో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి బహిరంగ సభ నిర్వహించి బీఆర్​ఎస్​ శ్రేణుల్లో జోష్‌‌ పెంచేందుకు కేసీఆర్​ ప్రయత్నించారు. 2018  సెప్టెంబర్​ 2న  కొంగరకలాన్‌‌లో పార్టీ ప్లీనరీ నిర్వహించి, ఆ వెంటనే  నాలుగురోజులకు అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్లారు. ఈసారి ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ పెట్టి పార్టీ మొత్తాన్ని ఎన్నికలకు సమాయత్తం చేసే యోచనలో కేసీఆర్‌‌ ఉన్నట్లు బీఆర్​ఎస్​ శ్రేణులు చెప్తున్నాయి.

ప్రతిపక్షాలు సిద్ధం

ప్రతిపక్షాలు కూడా ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో ముందే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని బీజేపీ స్టేట్​ చీఫ్​ సంజయ్‌‌‌‌, పీసీసీ చీఫ్​ రేవంత్‌‌‌‌ రెడ్డి పదే పదే చెప్తున్నారు. ఫిబ్రవరి చివరలోనే అసెంబ్లీ రద్దు ఉంటుందని రేవంత్‌‌‌‌ ఇటీవల వ్యాఖ్యానించారు. ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని సంజయ్‌‌‌‌ ప్రకటించారు. బీజేపీ కేడర్‌‌‌‌ను ఎన్నికలకు సిద్ధం చేయడానికి ఇకపై ప్రతి నెలా కేంద్ర హోంమంత్రి అమిత్‌‌‌‌ షా రాష్ట్రానికి రానున్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. ప్రధాని మోడీని రాష్ట్రానికి రప్పించే ప్రయత్నాల్లో బీజేపీ నేతలు ఉన్నారు. పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సహా ఇతర ప్రముఖులను రాష్ట్రానికి రప్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, కాంగ్రెస్​ ఇన్‌‌‌‌చార్జి మార్పుతో ఆ పార్టీలో గ్రూప్‌‌‌‌ వార్‌‌‌‌ కాస్త కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తున్నది. నేతలు ఒకరిపై ఒకరు కామెంట్లు చేయడం ఆగింది. నేతలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి ఎన్నికల్లో జట్టుగా పని చేయించే ప్రయత్నాల్లో కొత్త ఇన్‌‌‌‌చార్జ్​ మాణిక్‌‌‌‌ రావు థాక్రే ఉన్నారు. వైఎస్సార్‌‌‌‌ టీపీ, బీఎస్పీ, టీజేఎస్‌‌‌‌, ఇతర పార్టీలూ ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌తో కలిసి పోటీ చేసేందుకు కమ్యూనిస్టులు సిద్ధమవుతున్నారు.