
ఓ యాక్టర్‌కి ఉండాల్సిన మొదటి లక్షణం.. ఎలాంటి పాత్రనైనా పోషించడం. అయితే ఎంత మంచి యాక్టర్ అయినా ఒక్కోసారి కొన్ని జానర్స్‌కి సూట్ కారు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో అది కష్టం. కానీ కీర్తి సురేష్ ఇందుకు అతీతం. ఇప్పుడామె చేస్తున్న సినిమాలే అందుకు నిదర్శనం. ‘సర్కారువారి పాట’లో గ్లామరస్ హీరోయిన్. ‘సాని కాయిదమ్’లో డీ గ్లామరస్ రోల్. ‘భోళాశంకర్’లో హీరోకి చెల్లెలు. ‘వాశి’లో లాయరు. ‘దసరా’లోనూ ఎవరూ ఊహించని అవతార్ తనదని ఆ టీమ్ చెబుతోంది. ఈ లిస్టులో ఇప్పుడు మరో ఎక్స్‌పెరిమెంటల్ మూవీ చేరింది. కీర్తి కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చింది. ‘మామన్నన్’ టైటిల్‌తో ‘కర్ణన్’ ఫేమ్ మారి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో వెర్సటైల్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్, ఉదయనిధి స్టాలిన్ హీరోలు. ఈ ముగ్గురితో సమానమైన పాత్రను వడివేలు పోషిస్తున్నాడు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నాడు. ఆల్రెడీ షూటింగ్ మొదలైంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ డిఫరెంట్‌గా ఉంది. ఓ పెద్ద రాయికి గొలుసులు కట్టి ఉన్నాయి. దానిపై పదుల సంఖ్యలో పక్షులు వాలాయి. ఆ రాయి చుట్టూ బోలెడన్ని పశువులు కూడా గుమిగూడాయి. ఆకాశం నిండా కారుమబ్బులు కమ్ముకున్నాయి. ఏదో ఉపద్రవం సంభవించడానికి ముందు కనిపించే సూచనలా ఉందీ పోస్టర్. పైగా ఫహాద్ ఫాజిల్‌ని హీరోగా తీసుకున్నారంటే కచ్చితంగా స్పెషల్ సబ్జెక్టే అయి ఉంటుందనేది అందరి అభిప్రాయం. అంటే కీర్తి బ్యాగ్‌లో మరో డిఫరెంట్ మూవీ పడిందన్నమాటే.