కీసర బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్ అసంతృప్తి

కీసర బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్ అసంతృప్తి
  • పనుల తీరుపై కలెక్టర్ అమోయ్ కుమార్ అసంతృప్తి
  • పనులు శరవేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
  • ఈనెల 16 నుంచి 21వరకు శివరాత్రి జాతర

మేడ్చల్ జిల్లా : కీసరగుట్ట మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 16 నుండి 21 వరకు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పనులను జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పరిశీలించారు. కీసర గుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దర్శనం అనంతరం పార్కింగ్, క్యూ లైన్లు ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పనుల గురించి పలు శాఖల అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. 

మరో ఆరు రోజుల్లో బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఇంకా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయంటూ అధికారుల తీరుపై జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మండిపడ్డారు. శానిటేషన్ పనులను మరింత వేగవంతం చేయాలని డీపీఓ రమణమూర్తిని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కీసరగుట్ట మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని ఆదేశించారు. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు అధికారులందరూ అందుబాటులో ఉండాలని కోరారు. సమీక్ష సమావేశంలో జిల్లా అడిషల్ కలెక్టర్లు, జిల్లా అధికారులు, ఆలయ చైర్మన్ తాటకం రమేష్ శర్మ పాల్గొన్నారు.