
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సీబీఐ కస్టడీలో రౌస్ ఎవెన్యూ కోర్టు కొన్ని మినహాయింపులు కల్పించింది. మూడు రోజుల సీబీఐ కస్టడీలో కళ్లద్దాలు తన వద్దే ఉంచుకోవడానికి, మెడిసిన్స్ తీసుకోవడానికి, ఇంట్లో వండించి తెప్పించుకున్న ఆహారం తినడానికి, భగవద్గీతను చదవడానికి పర్మిషన్ ఇచ్చింది. అలాగే, ప్రతి రోజూ ఒక గంట భార్య, ఇతర బంధువులను కలిసేందుకు కూడా కోర్టు అనుమతించింది.
కాగా, ప్రతి రోజూ నిద్రపోయే ముందు తాను భగవద్గీత చదువుతానని సుప్రీంకోర్టుకు కేజ్రీవాల్ తెలిపారు. అలాగే, తీహార్ జైలుకు వెళ్లే సమయంలో తన ప్యాంట్ జారిపోతుండటంతో చేతితో పట్టుకొని వెళ్లాల్సి వచ్చిందని, ఇది చాలా ఇబ్బందికరంగా ఉందన్నారు. అందుకే తనకు బెల్టు ఇవ్వాలని కేజ్రీవాల్ అభ్యర్థించారు. అయితే, ఆయన అభ్యర్థనను ప్రత్యేక న్యాయమూర్తి అమితాబ్ రావత్ తోసిపుచ్చారు.