నేడు కేజ్రీవాల్ ప్రమాణం

నేడు కేజ్రీవాల్ ప్రమాణం

న్యూఢిల్లీమూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ప్రమాణస్వీకార కార్యక్రమంలో 60 మంది కామన్ పీపుల్ తో వేదిక పంచుకోనున్నారు. ‘ఢిల్లీ నిర్మాతలు’ (ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ఢిల్లీ) పేరుతో వివిధ రంగాలకు చెందినవారిని ఈ కార్యక్రమానికి గెస్ట్ లుగా ఎంపిక చేశారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్ లో జరిగే ప్రమాణస్వీకార కార్యక్రమంలో అరవింద్ కేజ్రీవాల్ తో డాక్టర్లు, టీచర్లు, ఫార్మాసిస్టులు, శానిటేషన్ వర్కర్లు, బస్సు కండక్టర్లు, బస్సు డ్రైవర్లు, మహిళలకు సెక్యూరిటి అందించే మార్షల్స్, ఆటో డ్రైవర్లు, రైతులు, అంగన్ వాడీ వర్కర్లు, అథ్టెట్లు, స్కాలర్ షిప్ కోసం పేర్లు నమోదు చేసుకున్న ట్రిపుల్ ఐటీ, మెడికల్ స్టూడెంట్స్, పీడబ్ల్యూడీ ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్ లు, ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు చేరవేసే డెలివరీ ఏజెంట్లు ఇతరులు వేదిక పంచుకోనున్నారు.

ప్రధాని, ఏడుగురు బీజేపీ ఎంపీలకు ఇన్విటేషన్

కేజ్రీవాల్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఇతర రాష్ట్రాల సీఎంలు, వివిధ పార్టీల నేతలను ఆప్ ఆహ్వానించలేదు. ప్రధాని నరేంద్ర మోడీ, ఢిల్లీకి చెందిన ఏడుగురు ఎంపీలకు మాత్రమే ఇన్విటేషన్ పంపినట్లు ఆప్ నేత గోపాల్ రాయ్ అన్నారు. శుక్రవారం ఉదయమే పీఎంవోకు లేఖ పంపినట్లు తెలిపారు. అయితే ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ రాకపై స్పష్టత లేదు. షెడ్యూల్ ప్రకారం ఆయన వారణాసి టూర్ కు వెళతారని సమాచారం.  ఆప్ తీసుకున్న నిర్ణయంపై ఢిల్లీ బీజేపీ మీడియా కన్వీనర్ నీలకాంత్ బక్షి స్పందించారు. “ఇది వాళ్ల షో. వాళ్లకు ఇష్టమైనట్లు చేసుకోవచ్చు” అని అన్నారు.

ఆరుగురు మంత్రుల ప్రమాణం

ఆదివారం జరిగే కార్యక్రమంలో కేజ్రీవాల్ తోపాటు ఆరుగురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్, గోపాల్ రాయ్, కైలాష్ గెహ్లాట్, ఇమ్రాన్ హుస్సేన్, రాజేంద్ర గౌతమ్ మంత్రులుగా ప్రమాణం చేస్తారని ఆప్ వర్గాలు తెలిపాయి. మంత్రులుగా ప్రమాణం చేయబోయేవారికి అరవింద్ కేజ్రీవాల్ శనివారం రాత్రి విందు ఇచ్చారు. ఢిల్లీ అభివృద్ధికి సంబంధించి రోడ్ మ్యాప్ పై వారితో చర్చించారు.

మరిన్ని వార్తల కోసం