కూటమి పీఎం అభ్యర్థిగా కేజ్రీవాల్​ను ప్రకటించాలె.. అధికార ప్రతినిధి ప్రియాంక డిమాండ్

కూటమి పీఎం అభ్యర్థిగా కేజ్రీవాల్​ను ప్రకటించాలె.. అధికార ప్రతినిధి ప్రియాంక డిమాండ్
  • పీఎం రేసులో కేజ్రీవాల్​ లేరని ఢిల్లీ మంత్రి క్లారిటీ

న్యూఢిల్లీ: ప్రతిపక్షాల కూటమి ఇండియా బ్లాక్ కు ఢిల్లీ సీఎం, తమ పార్టీ కన్వీనర్  అర్వింద్  కేజ్రీవాల్  ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఉండాలని కోరుకుంటున్నామని ఆప్  జాతీయ ప్రతినిధి ప్రియాంకా కక్కర్  అన్నారు. ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్  ఒక మోడల్ ను అందించారని, ఆయన ప్రవేశపెట్టిన పథకాలతో ఢిల్లీ ప్రజలు లబ్ధి పొందుతున్నారని  ఆమె పేర్కొన్నారు. బుధవారం ఓ వార్తా సంస్థతో ఆమె మాట్లాడారు. దేశ ప్రజల సమస్యలను కేజ్రీవాల్  ఎప్పటికపుడు లేవనెత్తుతూ వాటి  పరిష్కారం కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. ఢిల్లీలో అత్యంత తక్కువ ద్రవ్యోల్బణం ఉండడానికి ఆయనే కారణమన్నారు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా కేజ్రీవాల్ ను ప్రకటించాలని కోరుకుంటున్నామని ఆమె వ్యాఖ్యానించారు. 

ఆప్ జాతీయ ప్రతినిధిగా తాను ఈ ప్రతిపాదన చేస్తున్నానని ఆమె వెల్లడించారు. అలాగే ఆప్ ఢిల్లీ కన్వీనర్, పర్యావరణ శాఖ మంత్రి గోపాల్  రాయ్‌‌‌‌  కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇండియా కూటమి నుంచి ప్రధాని అభ్యర్థిగా కేజ్రీవాల్ ను ప్రకటించాలని తమ పార్టీలో ప్రతిఒక్కరూ కోరుకుంటున్నారని రాయ్  తెలిపారు. అయితే, ప్రియాంక, గోపాల్  రాయ్ చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ క్యాబినెట్  మినిస్టర్  అతిషి సింగ్  స్పందించారు. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి రేసులో కేజ్రీవాల్  లేరని ఆమె క్లారిటీ ఇచ్చారు. తాను అధికారికంగా ఈ ప్రకటన చేస్తున్నానని ఆమె స్పష్టం చేశారు. ప్రియాంక, గోపాల్  రాయ్  వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమని తెలిపారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే కేజ్రీవాల్.. ఇండియా కూటమిలో చేరారని ఆమె వెల్లడించారు.