ఈడీ అరెస్ట్​పై తక్షణ విచారణ కుదరదు సుప్రీంకోర్టులో  కేజ్రీవాల్‌కు దక్కని ఊరట

ఈడీ అరెస్ట్​పై తక్షణ విచారణ కుదరదు సుప్రీంకోర్టులో  కేజ్రీవాల్‌కు దక్కని ఊరట

న్యూఢిల్లీ, వెలుగు: తన​అరెస్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్​ కు ఊరట దక్కలేదు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని ఆయన సుప్రీంలో సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై తక్షణ విచారణ చేపట్టాలని కోరారు. పిటిషన్ ను పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం.. తక్షణ విచారణ కుదరదని స్పష్టం చేసింది. ఈడీ అరెస్ట్ చట్టబద్ధమేనంటూ హైకోర్టు వెలువరించిన తీర్పుపై ఢిల్లీ సీఎం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను సోమవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్‌‌ దీపాంకర్‌‌ దత్తా లతో కూడిన బెంచ్ పరిశీలించింది.

దీనిపై వివరణతో ఈ నెల 24 లోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ ఈడీకి నోటీసులు పంపింది. ఈడీ దాఖలు చేయబోయే కౌంటర్ పై ఈ నెల 27 లోగా రీజాయిండర్ దాఖలు చేయాలని కేజ్రీవాల్​తరఫు న్యాయవాదులకు సూచించింది. పిటిషన్ పై ఏప్రిల్ 29 న విచారణ చేపడతామని బెంచ్​తెలిపింది. కాగా, ఈడీ అరెస్ట్ చట్ట విరుద్ధమని ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కేజ్రీవాల్ లాయర్​ అభిషేక్ మను సింఘ్వి విజ్ఞప్తి చేయగా.. ఈ కేసులో ఏం జరిగిందనేది తమకు తెలుసునని బెంచ్​వ్యాఖ్యానించింది.

ఏప్రిల్ 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు..

కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని రౌస్ ఎవెన్యూ కోర్టు ఏప్రిల్ 23 వరకు పొడిగించింది. గతంలో విధించిన 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ సోమవారం తో ముగిసింది. దీంతో జైలు సిబ్బంది కేజ్రీవాల్ ను వర్చువల్ గా కోర్టులో హాజరుపరిచారు. విచారణ కీలక దశలో ఉందని, మరో 14 రోజులు కస్టడీని పొడిగించాలని ఈడీ కోరగా.. 9 రోజులు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.