వ్యాక్సిన్ల కోసం దాచుకున్నదంతా విరాళం ఇచ్చిండు

వ్యాక్సిన్ల కోసం దాచుకున్నదంతా విరాళం ఇచ్చిండు
  •  
  • కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు 2 లక్షలు ఇచ్చిన దివ్యాంగుడు
  • ప్రజల ప్రాణాల కన్నా డబ్బు గొప్పదేంకాదన్నడు
  • బ్యాంకు వాళ్లు కొంత ఉంచుకోమన్నా మొత్తం ఇచ్చేసిండు 

ఆయనో దివ్యాంగుడు. బీడీలు చుడుతూ బతుకు వెళ్లదీస్తున్నాడు. ప్రజలకు వ్యాక్సిన్ వేయించడానికి సాయం చేయాలని కేరళ సీఎం పిలుపునిస్తే తన దగ్గరున్న రూ. 2 లక్షల సేవింగ్స్ ను సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇచ్చేశాడు. జనం ప్రాణాల కన్నా తన దగ్గరున్న డబ్బు గొప్పదేం కాదన్నాడు. అవసరమైతే బీడీలు చుట్టి మళ్లీ సంపాదించుకుంటానని చెప్పాడు. 
   
వరదలు, కరోనాతో కేరళ సతమతం
2018లో వరదలు, ఇప్పుడు కరోనా విరుచుకుపడుతుండటంతో కేరళ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. ప్రజలందరికీ వ్యాక్సిన్ ఖర్చు భరించడం ఆ రాష్ట్ర సర్కారుకు భారమైంది. దీంతో విరాళాలు ఇవ్వాలని ప్రజలకు సీఎం పినరయి విజయన్ పిలుపునిచ్చారు. ఆయన పిలుపుకు ఎంతోమంది స్పందించారు. సీఎం ప్రకటనను టీవీలో చూసిన కేరళలోని కన్నూర్ కు చెందిన బీడీ కార్మికుడు జనార్దనన్.. తాను కూడా సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. తన సేవింగ్స్ దాచుకున్న బ్యాంకుకు వెళ్లాడు. తన దగ్గరున్న 2 లక్షల 850 రూపాయల్లో రూ.2 లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇస్తానని బ్యాంకు సిబ్బందికి చెప్పాడు. వాళ్లు ఆశ్చర్యపోయారు. సగం దగ్గర పెట్టుకొని మిగిలింది ఇవ్వమని సలహా ఇచ్చారు. కానీ ఆయన మొత్తం డబ్బు ఇస్తానన్నాడు.
 
పెన్షన్ వస్తోంది.. బీడీలు చేసుకుంట..
డబ్బులన్నీ ఇచ్చేసి నువ్వెలా బతుకుతావు అని బ్యాంకు సిబ్బంది అడగ్గా.. ‘బీడీలు చుట్టుకొని సంపాదించుకుంట. పైగా నాకు దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్‌ కూడా వస్తోంది. మనుషుల ప్రాణాల కన్నా నా డబ్బు గొప్పదేం కాదు’ అని అన్నాడు. వ్యాక్సిన్ కోసం డబ్బు ఖర్చు చేయలేని వారి కోసం తన డబ్బు ఉపయోగపడితే చాలని చెప్పాడు. జనార్దనన్ భార్య కిందటేడాది చనిపోయారు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. బీడీ కార్మికుడి సాయం విషయాన్ని సీఎం పినరయి స్వయంగా ట్విటర్ లో షేర్ చేశారు. ఆయనది పెద్ద మనసని పొగిడారు. ఇది కాస్త సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. జనార్దనన్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.