కేరళలో మళ్లీ నిఫా వైరస్ కలకలం.. సీఎం ప్రోగ్రామ్ వాయిదా

కేరళలో మళ్లీ నిఫా వైరస్ కలకలం.. సీఎం ప్రోగ్రామ్ వాయిదా

కేరళలో మళ్ళీ నిఫా వైరస్ కలకలం రేపుతోంది. మలప్పురం జిల్లాలోని వాలంచెరికి చెందిన 42 ఏళ్ల మహిళకు వైరస్ పాజిటివ్ రావడంతో  రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఏప్రిల్ 25న జ్వరంతో ఆమె ఆస్పత్రిలో  చేరగా ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉంది .  పెరింతల్మన్నలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆ మహిళ  తీవ్ర జ్వరం, నిరంతర దగ్గు, తీవ్రమైన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతోంది. మలప్పురం జిల్లాలో  నిపా వైరస్   పాజిటివ్ రావడం మూడోది. 

ఆ మహిళ ఇంట్లోని మరో ఆరుగు కుటుంబ సభ్యులలో కూడా ఇలాంటి లక్షణాలు  కనిపించాయి.  ఆ ఆరుగురు వ్యక్తులకు పరీక్షలు చేయగా నెగటివ్‌గా వచ్చాయని కేరళ ప్రభుత్వం  తెలిపింది. వ్యాధి సోకిన  వ్యక్తితో సంబంధం ఉన్న 49 మంది ఇప్పటికీ వైద్య పరిశీలనలో ఉన్నారు. వారిలో, తేలికపాటి లక్షణాలతో ఉన్న ఐదుగురిని  మంజేరి మెడికల్ కాలేజీలోని ఐసోలేషన్ లో చేర్చారు. అప్రమత్తమైన అధికారులు ఏప్రిల్ 25 నుంచి  రోగి సందర్శించిన ప్రదేశాల నుంచి  సిసిటివి ఫుటేజ్‌లను కూడా సేకరిస్తున్నారు.  

Also Read : ఢిల్లీ టార్గెట్ గా పాకిస్తాన్ ఫతా 2 క్షిపణి ప్రయోగం

మహిళ ఇంటికి మూడు కిలోమీటర్ల  దూరంలో  ఉన్న ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. మరో వైపు ఉత్తర కేరళ జిల్లాలో నిపా కేసు నిర్ధారించడంతో ముఖ్యమంత్రి పినరయి విజయన్ మే 12న ఇక్కడ జరగాల్సిన జిల్లా స్థాయి కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు అధికారులు  తెలిపారు.

నిఫా వైరస్ అంటే..

నిపా వైరస్ అనేది జూనోటిక్ వైరస్. ఇది జంతువుల నుంచి మానవులకు.. కొన్ని సందర్భాల్లో వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాపిస్తుంది. ఇది కలుషితమైన ఆహారం ద్వారా లేదా నేరుగా వ్యక్తుల మధ్య కూడా వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ను 1999లో గుర్తించారు. మలేషియాలోని సుంగై లో ఈ వైరస్ ను కనుక్కోవడంతో ఈ గ్రామానికి నిపా అనే పేరు పెట్టారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, నిఫా అనేది పారామిక్సోవైరస్. ఇది జలుబుకు కారణమయ్యే కొన్ని వైరస్‌లలో ఒకటైన హ్యూమన్ పారాఇన్‌ఫ్లూయెంజా వైరస్‌కి సంబంధించినది. ఇప్పటి వరకు మానవులకు సోకిన నిఫా వైరస్ కేసులన్నీ గబ్బిలాలతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంపర్కం వల్లనే సంభవించాయి.

సంకేతాలు, లక్షణాలు

  • నిపా వైరస్ సంక్రమణ ప్రారంభ లక్షణాలు అనేక రకాలుగా ఉంటాయి. వాటిలో జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, అలసట ఉన్నాయి. ఈ లక్షణాలతో పాటు మైకం, మగత, నాడీ సంబంధిత సంకేతాలు, 24-48 గంటల్లో కోమాకు దారితీయవచ్చు.
  • నిపా వైరస్ వల్ల దగ్గు, శ్వాస ఆడకపోవడం, గొంతు నొప్పి వంటి శ్వాసకోశ లక్షణాలను కూడా కలిగిస్తుంది. అలాగే, నిపా ఇన్ఫెక్షన్ అనేది ఎన్సెఫాలిటిస్ (మెదడు వాపు). ఇది తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. తీవ్రమైన సందర్భాల్లో, నిఫా వైరస్ సంక్రమణ వల్ల అధిక జ్వరం, గందరగోళం, మూర్ఛలు, కొన్ని సార్లు మరణానికి కూడా దారి తీస్తుంది