
కేరళలోని అలప్పుజ సిటీలో తిరుగుతున్న ఈ బస్సులో జర్నీ సేఫ్ మాత్రమే కాదు కంఫర్టబుల్ కూడా. మామూలు ఆర్టీసీ బస్సుని ఒక టూరిస్ట్ బస్లా డెకరేట్ చేశారు డ్రైవర్ గిరి గోపీనాథ్, కండక్టర్ తార. వీళ్లు హరిపాడ్ బస్ డిపోలో దాదాపు పదేండ్లుగా పనిచేస్తున్నారు. విశేషం ఏంటంటే..వీళ్లిద్దరు భార్యాభర్తలు. ఆర్టీసీ బస్సు జర్నీని ప్యాసెంజర్ ఇష్టపడేలా చేయాలని పై అధికారుల అనుమతి తీసుకుని మరీ ఇలా మార్చారు. ప్రయాణికుల భద్రత కోసం బస్సులోపల ఆరు సీసీ కెమెరాలు పెట్టారు. ఎమర్జెన్సీ టైంలో అందరిని అలర్ట్ చేసేందుకు బస్సులో ఎస్ఓఎస్ కాల్ బటన్స్ ఏర్పాటుచేశారు.
డ్రైవర్ సీటు నుంచి లగేజి పెట్టుకునే బాక్స్‌లు, చివరి సీటు వరకు ఉన్న రంగురంగుల బుగ్గలు, బొమ్మలు, దారాలని చూస్తే తిరునాళ్లు, జాతరకు వెళ్లే బస్ ఎక్కిన ఫీలింగ్ కలుగుతుంది. ప్యాసింజర్లను ఎంటర్టైన్ చేసేందుకు సౌండ్ బాక్స్‌లు ఉన్నాయి. బోర్ కొట్టకుండా పాటలు వింటూ హాయిగా జర్నీ చేయొచ్చు. ఆటోమెటిక్ ఎయిర్ ఫ్రెష్నర్ కూడా ఉంది ఈ బస్‌లో. బస్ని డెకరేట్ చేసేందుకు సొంత డబ్బు ఖర్చుచేసింది ఈ జంట. ఒకసారి ఈ బస్ ఎక్కిన వాళ్లు ఇందులో మళ్లీ జర్నీ చేసేందుకు ఇష్టపడుతున్నారు. అంతేకాదు వాట్సాప్ గ్రూప్‌లు పెట్టి ఈ బస్ గురించి అందరికీ చెప్తున్నారు కూడా.
ఇరవై ఏండ్లు ప్రేమలో..
“ఇరవై ఏండ్ల కిందట ఇద్దరం ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాళ్లం. దాదాపు 20 ఏండ్లు ప్రేమించుకున్నాం. అయితే జాతకాలు కలవకపోవడంతో పెద్దలు పెండ్లికి ఒప్పుకోలేదు. చివరకు అందర్నీ ఒప్పించి 2019లో పెండ్లి చేసుకున్నాం. రోజూ తెల్లవారుజామున ఒకటింబావుకి నిద్ర లేస్తాం. రెండు గంటలకల్లా డిపోకి వెళ్తాం. ఇద్దరం కలిసి బస్ని శుభ్రం చేస్తాం. 5.50కి మా డ్యూటీ మొదలవుతుంది” అని చెప్పింది తార.