బోర్డ్ ఎగ్జామ్స్ ఆపాల‌ని పిటిష‌న్.. కొట్టేసిన హైకోర్టు

బోర్డ్ ఎగ్జామ్స్ ఆపాల‌ని పిటిష‌న్.. కొట్టేసిన హైకోర్టు

క‌రోనా లాక్ డౌన్ కార‌ణంగా ఆగిపోయిన ఎస్ఎస్ఎల్సీ (టెన్త్), 12వ త‌ర‌గ‌తి బోర్డ్ ఎగ్జామ్స్ ను రేప‌టి (మంగ‌ళ‌వారం) నుంచి నిర్వ‌హించాల‌ని కేర‌ళ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దీనికి సంబంధించి ఇప్ప‌టికే షెడ్యూల్ కూడా విడుద‌ల చేసింది. క‌రోనా వ్యాపించ‌కుండా త‌గిన జాగ్రత్త‌లు తీసుకుంటూ ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే క‌రోనా వైర‌స్ ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేద‌ని, లాక్ డౌన్ ఈ నెల చివ‌రి వ‌ర‌కు ఉన్న నేప‌థ్యంలో ఈ పరీక్ష నిర్వ‌హ‌ణ‌ను అడ్డుకోవాల‌ని కోరుతూ కేర‌ళ హైకోర్టులో ఓ వ్య‌క్తి పిటిష‌న్ వేశారు. బోర్డు ప‌రీక్ష‌ల‌ను రేప‌టి నుంచి నిర్వ‌హించాల‌న్న రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై స్టే విధించాల‌ని కోరారు. విద్యార్థులు గుంపులు గుంపులుగా చేసే అవ‌కాశం ఉంద‌ని, ఈ నేప‌థ్యంలో వైర‌స్ వ్యాప్తి పెరిగే అవ‌కాశం ఉంద‌ని కోర్టుకు వివ‌రించారు. అయితే ఈ పిటిష‌న్ ను విచారించిన కోర్టు దానిని డిస్మిస్ చేసింది. వైర‌స్ వ్యాప్తి జ‌రిగే ప్ర‌మాదం లేకుండా అన్ని ర‌కాల జాగ్రత్త‌లు తీసుకుంటూ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ చేప‌డుతామ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం చెప్పింద‌ని ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది. సోష‌ల్ డిస్టెన్స్ పాటించ‌డం, శానిటైజ‌ర్ వాడ‌డం, ఎగ్జామ్ సెంట‌ర్ల ద‌గ్గ‌ర శానిటేష‌న్, విద్యార్థులు గుంపులు చేర‌కుండా చూడ‌డం స‌హా అన్ని ర‌కాల ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు చేప‌డుతామ‌ని తెలిపిందంటూ.. పిటిష‌న్ ను కొట్టేసింది.