
తిరువనంతపురం: సరదాగా ఆట పట్టించాలని ఫేస్‌బుక్‌లో ఫేక్ అకౌంట్‌తో ‘లవ్ ప్రాంక్’ చేయడం వల్ల మూడు నిండు ప్రాణాలు బలయ్యాయి. ఆ ముగ్గురులో గంటల క్రితం పుట్టిన ఒక పసివాడు కూడా ఉన్నాడు. ఈ దారుణం కేరళలోని కొల్లం జిల్లాలో జరిగింది. జనవరి నెలలో చెత్త కుప్పల్లో పడి ఉన్న పసికందు కేసును ఎంక్వైరీ చేసిన పోలీసులు ఎట్టకేలకు అసలు విషయం చేధించారు. ఆ పసివాడి తల్లి రేష్మను అరెస్టు చేశారు.
కేసు ఇదీ..
ఈ ఏడాది జనవరిలో కేరళలోని కొల్లం జిల్లాలో కొన్ని గంటల క్రితం పుట్టిన పసి బిడ్డను లోకల్స్ గుర్తించారు. ఆ పసికందును ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఆ బిడ్డను అలా వదిలి వెళ్లిందెవరన్న దానిపై ఎంక్వైరీ చేయయగా కొల్లం జిల్లాలోని కలువత్తుక్కల్ గ్రామానికి చెందిన రేష్మ అని గుర్తించారు. ఆమెనే ఆ బిడ్డ తల్లి. అయితే అలా ఎందుకు చేసిందన్నదానిపై పోలీసులు ఎంక్వైరీలో ఊహించని ట్విస్టులు తెలిశాయి.
అసలేం జరిగింది?
ఫేస్‌బుక్ చాటింగ్ ద్వారా తాను ప్రేమలో పడిన ఆనందు అనే వ్యక్తిలో వెళ్లిపోవడం కోసం బిడ్డను అలా వదిలేసినట్లు పోలీసులు ఎంక్వైరీలో రేష్మ చెప్పింది. కానీ ఆ బాయ్‌ఫ్రెండ్ ఆనందును ఆమె ఎప్పుడూ చూడనేలేదు. కానీ ఫేస్ బుక్ చాటింగ్‌లో ‘అతడు’ మాటలకు పడిపోయి, కనీసం అప్పటికే ఆమె గర్భిణి అన్న విషయం కూడా తన భర్త విష్ణుకు తెలియకుండా దాచి, ఇంటికి దూరంగా మరోచోట ఉండి బిడ్డను కన్నట్టు పోలీసులకు తెలిపింది. కానీ పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో తెలిసిన విషయమేంటంటే అసలు ఆనందు అనే వ్యక్తినే ఎవరూ లేరు. ఆ పేరుతో చాటింగ్ చేసింది.. రేష్మ మరదలు ఆర్య, మేనకోడలు గ్రీష్మ. ఫేస్‌బుక్ చాటింగ్ చేసిన ఐడీ వివరాలను తీసుకుని పోలీసులు చేసిన ఎంక్వైరీలో ఈ విషయం బయటపడింది. అయితే ఆ ఇద్దరు సరదగా ఆటపట్టించాలని చేసిన పని అలా రేష్మ బిడ్డతో పాటు తమ ప్రాణాలను మింగేస్తుందని వాళ్లు ఊహించలేదు. ఈ కేసుకు సంబంధించి ఎంక్వైరీకి రావాలని ఆర్య, గ్రీష్మలకు పోలీసులు నోటీసులు ఇవ్వడంతో గత నెలలో వాళ్లిద్దరూ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే వాళ్ల సూసైడ్ తర్వాత గ్రీష్మ స్నేహితుడిని పోలీసులు విచారించగా, ఆమె ఫేస్‌బుక్‌లో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి రేష్మతో ‘లవ్ ప్రాంక్’ చేస్తున్నట్లు చెప్పిందని చెప్పాడు. ఇలా సరదా కోసం చేసిన పని ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది.
బిడ్డను వదిలేసిన రేష్మకు కరోనా పాజిటివ్
గంటల క్రితం పుట్టిన తన బిడ్డను చెత్త కుప్పలో పడేసి, ఆ పసివాడి మరణానికి కారణమైన రేష్మను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే ఆమెకు కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆమెను క్వారంటైన్‌లో ఉంచి ట్రీట్‌మెంట్ అందిస్తున్నామని పోలీసులు తెలిపారు.