
కేరళలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. పక్షులు, జంతువులు ఆహారం లేక అల్లాడుతున్నాయి. బలమైన ఈదురు గాలులకు చెట్లు విరిగి పడుతుండటంతో.. పక్షులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రాణాలు విడుస్తున్నాయి. మంగళవారం (మే 27) ఆకాశానికి చిళ్లు పడినట్లుగా గ్యాప్ లేకుండా కురుస్తున్న కుంభవృష్టితో కేరళలో కొన్ని ప్రాంతాలు అల్లకల్లోలం అయ్యాయి.
భారీ వర్షాలకు రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. చెట్లు కూలి ట్రాక్ లపై పడుతుండటంతో రైళ్లు నడపడం కష్టంగా మారింది. కోజికొడ్-అరీకొడ్ మార్గంలో భారీ వృక్షం విరిగి పడటంతో రైల్వే కరెంటు లైన్ తీగలు ట్రాక్ పై పడిపోయినట్లు అధికారులు ప్రకటించారు. రూట్లను క్లియర్ చేసి రైళ్లను నడపాలనుకున్న కొద్ది గంటల్లోనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెప్పారు. తిరువనంతపురం వందే భారత్, పరశురాం ఎక్స్ ప్రెస్ మొదలైన రైళ్లు ఆలస్యంగా నడుస్తాయని ప్రకటించారు.
ALSO READ | Weather:కుండపోత వర్షాలతో రెడ్ అలర్ట్ ఇచ్చిన కేరళ
భారీ వర్షాలకు నదులలో నీటిమట్టం అంతకంతకూ పెరిగిపోయి లోతట్టు ప్రాంతాలకు ప్రవహిస్తున్నాయి. ఉత్తర వయనాడ్ జిల్లాలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు మంగళవారం (మే 27) ఇండ్లు కొట్టుకుపోయాయి. దాదాపు 600 ఇండ్లు కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రజలు ఫైబర్ బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరళివెళ్తున్నట్లు తెలిపారు. వందల మంది ట్రైబల్స్ ను రిలీఫ్ క్యాంపులకు చేర్చారు అధికారులు.
భారీ వర్షాలకు ఎర్నాకులం జిల్లాలో ఇండ్లతో పాటు పంటలన్నీ నేలమట్టమయ్యాయని, భారీగా ఆస్తి నష్టం అయ్యిందని తెలిపారు అధికారులు. ముఖ్యంతా కొత్తమంగళం ఏరియా పూర్తిగా డ్యామేజ్ అయినట్లు తెలిపారు.
ఇక నగరాలు, పట్టణాల లోతట్టు ప్రాంతాలు జలమయం అవ్వడంతో ట్రాఫిక్ లో చిక్కుకుని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తిరువనంతపురం లోని కల్లార్ లో భారీ బిల్డింగ్ లు కూలిపోయి ట్రాఫిక్ స్థంభించిపోయింది.
కేరళలో సంభవించిన జల విలయంపై రెవెన్యూ మంత్రి కే రాజన్ మాట్లాడారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 607 ఇండ్లు కూలిపోయాయని.. అందులో 21 ఇండ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయని తెలిపారు. వర్షాల కారణంగా కరెంటు సప్లై నిలిచిపోయి ప్రజలు ఆందోళన చెందుతున్నారని, త్వరలోనే పునరుద్ధరిస్తామని చెప్పారు.
మంగళవారం వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ విడుదల చేసింది. తిరువనంతపురం, కొల్లాం, అలపూజ, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకులం, మలప్పురం, కోజికొడ్, కన్నూర్, కాజర్ ఘడ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. 11 నుంచి 20 సెంటీమీటర్ల భారీ వర్షాలు కురిస్తేనే ఆరెంజ్ అలర్ట్ ప్రకటిస్తారు. అంటే కేరళలో వర్షాలు ఎంతగా కురుస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.
నైరుతి రుతుపవనాలు ముందుగానే కేరళలోకి ప్రవేశించడం.. రోహిణి కార్తె పూర్తి కాకముందే వర్షాలు కురవడంతో.. కేరళ అతలాకుతలం అయ్యింది. మరో రెండు రోజులు ఇలాగే కురిస్తే ఏర్పడే నష్టాన్ని అంచనా వేయలేమని రెవెన్యూ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.