
హ్యాకర్... అనగానే చెడు కోసమే పనిచేస్తారు అనుకుంటారు. కానీ, మంచి పనులు కూడా చేసేవాళ్లుంటారు. మంచి అంటే, టెక్ కంపెనీల డిజిటల్ సర్వర్స్‌లో ఉండే ప్రాబ్లమ్స్ కనిపెట్టి, వాటిని సాల్వ్ చేస్తారు. దానివల్ల మంచి పేరుతోపాటు, డబ్బులు కూడా సంపాదించిన వాళ్లు చాలామందే ఉన్నారు. ఇతను చదివేది బీటెక్ అయినా.. తనకున్న ఎథికల్ హ్యాకింగ్ స్కిల్స్‌తో పెద్దపెద్ద కంపెనీలకి పని చేస్తూ, చిన్న వయసులోనే పేరుపొందిన హ్యాకర్లలో ఒకరిగా ఎదిగాడు. అతనెవరంటే...
కేరళ, అలప్పుజ జిల్లాలోని మంకొంబులో ఉంటాడు కె.ఎస్. అనంతకృష్ణన్. పథనంతిట్టలో ఉన్న మౌంట్ జియాన్ ఇంజినీరింగ్ కాలేజీలో కంప్యూటర్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఇంటర్ చదువుతున్నప్పటి నుంచే కోడింగ్, హ్యాకింగ్ మీద ఇంట్రెస్ట్‌తో వాటిని నేర్చుకున్నాడు. అయితే, ఈ మధ్య యాపిల్ కంపెనీ.. ఐక్లౌడ్‌లో సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానివల్ల యూజర్ల పర్సనల్ డేటా రిస్క్‌లో పడే అవకాశం ఉందని దాన్ని సరిచేస్తూ అప్‌డేట్ రిలీజ్ చేసింది.
‘ఈ అప్‌డేట్‌లో కూడా సెక్యూరిటీ బగ్స్ ఉన్నాయి. యాపిల్ అకౌంట్ కొత్తగా ఎవరు క్రియేట్ చేసుకున్నారో, కేవలం వాళ్లకే ఈ అప్‌డేట్ వల్ల ఐక్లౌడ్ సెక్యూరిటీ రిస్క్ ఉండదు. పాత యాపిల్ యూజర్లకు సెక్యూరిటీ రిస్క్ అలానే ఉంటుంద’ని యాపిల్ ఇంజినీర్లకు అనంతకృష్ణన్ చెప్పినా వాళ్లు దాన్ని కనిపెట్టలేకపోయారు. దాంతో ఆ బగ్ ఎక్కడుందో అనంతకృష్ణనే కనిపెట్టి ప్రాబ్లమ్ సాల్వ్ చేశాడు. అందుకు యాపిల్ కంపెనీ 2,500 డాలర్లు అంటే దాదాపు రెండు లక్షల రూపాయలు ఇచ్చి, హాల్ ఆఫ్ ఫేమ్‌తో (ఏదైనా విషయంలో విజయం సాధించిన వాళ్లకిస్తారు) సన్మానించారు ఇతన్ని. యాపిల్ ఒక్క దానికే కాదు గూగుల్, ఫేస్‌బుక్, గిట్‌హబ్‌లాంటి చాలా కంపెనీలకి పనిచేసి హాల్ ఆఫ్ ఫేమ్ అందుకున్నాడు.