ఐలాండ్ ను తలపించే ప్రదేశాలు.. ఎటు చూసినా పచ్చదనమే!

ఐలాండ్ ను తలపించే ప్రదేశాలు.. ఎటు చూసినా పచ్చదనమే!

ఎటుచూసినా కనుచూపు మేర పచ్చదనం.కాలంతో పని లేకుండా కురిసే వర్షాలు. ఐలాండ్​ను తలపించే ప్రదేశాలు. ప్రకృతితో కలిసిపోయే లైఫ్ స్టయిల్, కొబ్బరి నూనెతో చేసే వంటకాలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రత్యేకతలు.. తనలో దాచుకుంది  కేరళ. అక్కడున్న టూరిస్ట్ ప్లేస్​ల్లో వయనాడ్ ఒకటి.

వాటర్ ఫాల్స్​, గుహలు, వైల్డ్ లైఫ్ శాంక్చురీ... ఇలా బోలెడు స్పెషాలిటీస్​ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకునే ముందు... ‘వయనాడ్’ అనే పేరుకు ఉన్న చరిత్ర తెలుసుకోవాలి. పూర్వం వయనాడ్​ని ‘మయ క్షేత్ర’ అని పిలిచేవారు. అంటే మయులు ఉండే ప్రాంతం అని అర్థం. ఆ తర్వాత ‘మయనాడ్’ అనేవాళ్లు. అది కాలక్రమేణా ‘వయనాడ్​’గా మారింది. అయితే, అక్కడి ప్రజలు చెప్పేదాని ప్రకారం, ‘వయనాడ్’ అనే పేరు ‘వయల్’, ‘నాడ్’ అనే పదాల నుంచి వచ్చింది. ‘వయల్’​ అంటే ‘వరిపొలాలు’, ‘నాడ్’ అంటే ‘నేల’ అని అర్థం అని చెప్తారు వాళ్లు. ఈ వయనాడ్​ని 1980, నవంబర్​ ఒకటో తేదీన జిల్లాగా ప్రకటించారు. దాంతో కేరళలో పన్నెండో జిల్లా అయింది వయనాడ్. సుగంధ ద్రవ్యాలు పండించేందుకు కూడా ఫేమస్ ప్లేస్ ఇది. 

డ్రీమ్ ప్లేస్

మూడు వేల సంవత్సరాల ముందే ఈ ప్రాంతం మనుగడలో ఉందని ఆర్కియాలజీ రీసెర్చ్​ల్లో తేలింది. ఇక్కడ కనిపించే కొన్ని శిల్పాలను చూస్తే ఈ ప్రదేశం క్రీస్తు పుట్టుకకు పది శతాబ్దాల ముందే ఉండి ఉంటుందని తెలుస్తోంది. కొన్ని వందల ఏండ్ల పాటు గొప్ప హిస్టారికల్​ కల్చర్​ను కలిగిన ప్రదేశంగా పాపులర్​ అయింది వయనాడ్. కొట్టాయం రాజ వంశీకులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. ఆ తర్వాత బ్రిటిష్​ వాళ్లు వందేండ్లకు పైగా వయనాడ్​ని పాలించారు. ఇక్కడ కనిపించే టీ, కాఫీ పంటలు బ్రిటిష్​ పరిపాలనలో మొదలైనవే. ఇక్కడికి వచ్చేందుకు బ్రిటిష్​ వాళ్లు చుట్టుపక్కల ప్రాంతాల్లో రోడ్డు వేయించారు. దాంతో వలస వెళ్లే వాళ్లలో చాలామంది ఇక్కడే ఇళ్లు కట్టుకుని సెటిల్​ అయ్యారు. వయనాడ్​లో ఉన్న పచ్చటి కొండల మధ్య కొన్ని పురాతన తెగల వాళ్లు జీవిస్తున్నారు. వాళ్లకి ప్రజల్లో మమేకమవడం కంటే ప్రకృతి ఒడిలో సేదతీరడమే హాయి అనుకుంటారు. మరీ ఇంత విచిత్రంగా ఉంటారా? అనిపించొచ్చు. కానీ, ఒక్కసారి ఈ ప్లేస్​కి వెళ్తే ఎవరికైనా అలానే అనిపించడం ఖాయం.  

ఎడక్కల్ గుహలు

ఈ గుహలు సముద్ర మట్టానికి 1200 మీటర్ల ఎత్తులో ఉంటాయి. వీటి ఎత్తు 96 అడుగులు, వెడల్పు 22 అడుగులుంటాయి. వీటిలో  వాల్ కార్వింగ్స్(గోడ మీద వేసిన బొమ్మలు) ఆకట్టుకుంటాయి. వాటిలో మనుషులు, జంతువుల పెయింటింగ్స్ ఉంటాయి​. అవి నియోలిథిక్ యుగానికి సంబంధించినవిగా గుర్తించారు. మొదట దీన్ని ‘ఎడిక్కల్’ అనేవాళ్లు. అంటే ‘మధ్యలో ఉన్న రాయి’ అని అర్థం. ఎందుకంటే రెండు రాళ్ల మధ్య ఒక చిన్న రాయి సహజంగా ఏర్పడడం వల్ల దీన్ని అలా పిలుస్తారు. 

వయనాడ్ హెరిటేజ్ మ్యూజియం 

స్మృతులకు నిలయం వయనాడ్ హెరిటేజ్ మ్యూజియం. దీన్ని ‘అంబలవయల్ హెరిటేజ్ మ్యూజియం’ అని కూడా అంటారు. ఇక్కడ రెండో శతాబ్దానికి చెందిన వస్తువులు ఉంటాయి. కొన్ని నియోలిథిక్​ యుగానికి సంబంధించిన డెకొరేటివ్ ఐటమ్స్, టెర్రకోట బొమ్మలు, మెమోరియల్​ స్టోన్స్​ వంటివి ఉంటాయి. ఇందులో నాలుగు సెక్షన్స్​ ఉంటాయి. అవి దేవస్మృతి, గోత్రస్మృతి, వీరస్మృతి, జీవన్​స్మృతి. ఒక్కో బ్లాక్​లో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. 

  • వయనాడ్​లోని వెల్లారిమలలో సూచిపారా ఫాల్స్ ఉన్నాయి. వీటిని సెంటినెల్ రాక్​ వాటర్ ఫాల్స్​ అంటారు. చుట్టూ పచ్చదనం మధ్యలో జలపాతం ఉండడంతో ఈ ప్లేస్​ మనసును దోచేస్తుంది. ఇక్కడ క్లైంబింగ్ కూడా చేయొచ్చు. ​
  • బాణాసుర డ్యాం.. ఆసియాలోనే రెండో అతిపెద్ద డ్యాం. దీన్ని ఎంబ్యాంక్​మెంట్ డ్యాం అని కూడా అంటారు. ఇక్కడ స్పీడ్ బోటింగ్, ట్రెక్కింగ్ చేయొచ్చు. 
  • వయనాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కేరళలోనే టాప్. దక్షిణాదిలోనే ఫేమస్​ ఇది. ఇందులో ఉన్న వైల్డ్ యానిమల్స్​ని చూసేందుకు ప్రతి సంవత్సరం వేలల్లో టూరిస్ట్​లు వస్తుంటారు. పక్షిపాతాళం బర్డ్ శాంక్చురీ కూడా ఇక్కడ ఉంది.  
  • కోజికోడ్​ కు దగ్గర్లో ఉన్న వైథిరి అనే ప్లేస్​ రిసార్ట్స్​కి ఫేమస్​. దాన్ని రిసార్ట్ టౌన్​ అంటారు. అక్కడ పురాతన స్టైల్​ కాటేజ్​లు, గుడిసెలు, ట్రీ హౌస్​లు ఉంటాయి. వాటితోపాటు అలసట తీర్చేందుకు కొన్ని రిసార్ట్స్​లో ఆయుర్వేదిక్ మసాజ్​, స్పాలు కూడా ఉన్నాయి. 
  • కురువ ద్వీప్ అనే ఐలాండ్ కబిని నదిలో ఉంది. ఇక్కడి నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. అందుకని, ఈ నీళ్లు కలుషితం కాకుండా ఉండేందుకు ఫారెస్ట్ డిపార్ట్​మెంట్ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటుంది. 
  • అక్టోబర్​ నుంచి మే మధ్య ఎప్పుడైనా ఇక్కడికి వెళ్లొచ్చు. డిసెంబర్​ నుంచి ఫిబ్రవరి మధ్య మరింత కూల్​గా ఉంటుంది. డైరెక్ట్ ట్రైన్​ రూట్ లేదు. కోజికోడ్​ రైల్వే స్టేషన్​ లేదా ఎయిర్​పోర్ట్​లో దిగి బస్​ లేదా కార్​లో వెళ్లాలి.