హర్యానా ప్రభుత్వం.. కొత్త ప్రధాన కార్యదర్శిగా కేశిని ఆనంద్ ఆరోరాను నియమించింది. కేశిని… 1983 బ్యాచ్ ఐ.ఎ.ఎస్. అధికారి. నాలుగేళ్లుగా ప్రధాన కార్యదర్శిగా ఉన్న డి.ఎస్.దేశి పదవీ విరమణతో ఆయన స్థానంలోకి కేశిని వచ్చారు.
సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అయిన కేశినికి మరో పద్నాలుగు నెలలు మాత్రమే సర్వీస్ మిగిలి ఉంది. సాధారణ పరిపాలన, సిబ్బంది వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాల శిక్షణ, పాలనా సంస్కరణ శాఖలను ఆమె చూస్తారు.
హర్యానాలో ఇప్పటి వరకు నలుగురు మహిళలు ఈ హోదాలో పని చేయడం విశేషమైతే.. వీరిలో ముగ్గురు… ఒకే కుటుంబానికి చెందిన వారు ప్రధాన కార్యదర్శులవ్వడం మరో విశేషం. గతంలో మీనాక్షీ ఆనంద్ చౌదరి ఏడాదిపాటు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత ఆమె సోదరి ఊర్వశీ గులాటి మూడేళ్ల పాటు ఇవే బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత.. ప్రమీలా ఇస్సార్ అనే మరో మహిళ కొంతకాలం ఆ పదవిలో ఉన్నారు. ఇప్పుడు మళ్లీ గతంలో పనిచేసిన మీనాక్షీ, ఊర్వశి ల చెల్లెలు కేశిని అదే పదవి అందుకున్నారు.
కొత్తగా నియమితులైన కేశినికి.. ఐఎఎస్ అధికారిణిగా మంచి పేరుంది. ఇప్పటికే ఆమె చాలా రికార్డులు క్రియేట్ చేశారు. ఆమె హర్యానా ప్రభుత్వ తొలి మహిళా డిప్యూటీ కమిషనర్ అయ్యారు. వయోజన విద్యావ్యాప్తికోసం ఎనలేని కృషి చేశారు. మండల్ కమిషన్ అల్లర్లు, అలజడుల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో కీలక పాత్ర పోషించారు. నీతి, నిజాయితీకి, నిబద్ధతకు మారుపేరుగా కేశిని పేరు తెచ్చుకున్నారు.