నాగోబా జాతర షురూ.. అర్ధరాత్రి మెస్రం వంశీయుల పూజలు 

నాగోబా జాతర షురూ.. అర్ధరాత్రి మెస్రం వంశీయుల పూజలు 

గుడిహత్నూర్, వెలుగు: ఆదివాసీల పండుగ నాగోబా జాతర సంబురంగా మొదలైంది. కొత్తగా కట్టిన ఆలయంలో శనివారం అర్ధరాత్రి నాగోబా విగ్రహానికి గంగాజలంతో అభిషేకం చేసి మెస్రం వంశీయులు జాతరను ప్రారంభించారు. మొదట ఆలయ మురాడి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కేస్లాపూర్‌‌‌‌ గ్రామం నుంచి సంప్రదాయ వాయిద్యాలతో నాగోబా ఉత్సవ విగ్రహాన్ని ఆలయానికి తీసుకొచ్చారు. సిరికొండ నుంచి తెచ్చిన మట్టి కుండల్లో 22 కితల మెస్రం వంశ మహిళలు ఆలయ కోనేరు నుంచి నీళ్లు తీసుకొచ్చారు. మెస్రం వంశ అల్లుళ్లు ఆలయం వద్ద ఉన్న పాత పుట్టను తొలగించగా, మహిళలు కొత్త పుట్టను తయారు చేశారు. అనంతరం పూజల్లో పాల్గొన్న మెస్రం వంశీయులు.. ఆలయంలోని గోవాడ వద్ద చేరి కితల వారీగా బస చేశారు. నాగోబా ఆలయం వెనుక ఉన్న పెర్సపేన్, బాన్‌‌‌‌పేన్‌‌‌‌ లకు పూజలు చేసి నైవేద్యం సమర్పించారు. మహాపూజల అనంతరం మెస్రం వంశ కొత్త కోడళ్ల బేటింగ్‌‌‌‌ (పరిచయ కార్యక్రమం) జరిగింది. కొత్తగా లగ్గమైన మహిళలు తెల్లటి బట్టలు ధరించి బేటింగ్‌‌‌‌లో పాల్గొన్నారు. మెస్రం వంశ పెద్దల ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. 

సభలో మాట్లాడనున్న కేంద్రమంత్రి.. 
నాగోబా జాతరలో కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా పాల్గొననున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్‌‌‌‌తో కలిసి హైదరాబాద్‌‌‌‌ నుంచి హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌లో ఆదిలాబాద్ కు బయలుదేరుతారు. ఉదయం 11 గంటలకు కేస్లాపూర్‌‌‌‌ చేరుకొని గిరిజనుల ఆరాధ్యదైవం నాగోబాను దర్శించుకుంటారు. ఆ తర్వాత స్థానిక గిరిజనులతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం జాతర సమీపంలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో మాట్లాడతారు. సాయంత్రం తిరిగి హైదరాబాద్‌‌‌‌ చేరుకుంటారు. కాగా,  జాతరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముగ్గురు డీఎస్పీలు, ఏడుగురు సీఐలు, 28 మంది ఎస్సైలు సహా మొత్తం 450 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. దాదాపు 100కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.