తిరుమల పరకామణి కేసులో కీలక వ్యక్తి అనుమానాస్పద మృతి..

తిరుమల పరకామణి కేసులో కీలక వ్యక్తి అనుమానాస్పద మృతి..

తిరుమల పరకామణి కేసు ఏపీ పాలిటిక్స్ లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలకంగా ఉన్న మాజీ టీటీడీ ఏవీఎస్ఓ  సతీష్ కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందడం సంచలనంగా మారింది. అనంతపురం జిల్లా తాడిపత్రికి సమీపంలోని కోమలి గ్రామం దగ్గర ఉన్న రైల్వే ట్రాక్ పై సతీష్ మృతదేహం లభించడం కలకలం రేపుతోంది. పరకామణి కేసులో నవంబర్ 6న సతీష్ కుమార్ ను విచారించింది సీఐడీ. మరోసారి విచారణకు రావాల్సిందిగా సతీష్ కుమార్ కు నోటీసులిచ్చింది సిఐడి.

ఈ క్రమంలో సతీష్ కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. సతీష్ కుమార్ రన్నింగ్ ట్రైన్ లో నుంచి కిందపడి చనిపోయినట్టు సమాచారం. సతీష్ ప్రస్తుతం గుంతకల్లు రైల్వే రిజర్వ్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్నారు. ఇటీవల ఈ కేసును విచారించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పరకామణిలో అక్రమాలు జరుగుతున్నట్లు ఆధారాలున్నా.. ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది కోర్టు. టీటీడీ ఈవో, సీబీఎస్ఓను కోర్టు ఎదుట హాజరు కావాలని తెలిపింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం పరకామణి కేసుపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది.

అలాగే.. ఈ కేసులో నిందితుడుగా ఉన్న రవిపై ఏసీబీతో దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రవి కుటుంబసభ్యుల ఆస్తుల వివరాలు పరిశీలించి.. నివేదికను సీల్డ్ కవర్లో సమర్పించాలని ఆదేశించింది. పరకామణి అక్రమాలపై ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన సాధు పరిషత్ కు చెందిన పిటిషన్ దారుకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.వాదోపవాదాలు విన్న కోర్టు తదుపరి విచారణ డిసెంబర్ 2వ తేదికి వాయిదా వేసింది. పరకామణి చోరీ కేసును సీరియస్ గా తీసుకుంది ఏపీ ప్రభుత్వం.