
మహబూబ్‌నగర్, వెలుగు: టమాట రేట్లు పడిపోయాయి. మార్కెట్లో కిలో రూ.5 నుంచి రూ.10 లోపే పలుకుతున్నాయి. పక్క రాష్ట్రాల నుంచి భారీగా దిగుబడులు వస్తుండడంతో వ్యాపారులు మన రైతులకు రేట్లు తగ్గించేశారు. కిలోకు రూ.2 మాత్రమే చెల్లిస్తుండడంతో అన్నదాతలు ఆగమవుతున్నారు. కూలీలతో తెంపించి, తీసుకెళ్తే ఇటు కూలి పైసలు, అటు కిరాయి మీద పడ్తుండడంతో టమాటాలను తోటల్లోనే వదిలేస్తున్నారు. వేలకు వేలు పెట్టుబడి పెట్టి టమాట తోటలు సాగుచేశామని, తీరా రేటు పడిపోవడంతో పెట్టుబడులకూ మునుగుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
20వేల ఎకరాల్లో సాగు..
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 నుంచి 20వేల ఎకరాల్లో రైతులు టమాటా పంట సాగు చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే 1,200 మంది రైతులు 2,400 ఎకరాల్లో టమాట సాగు చేపట్టినట్లు అగ్రికల్చర్ ఆఫీసర్లు చెప్తున్నారు. ఇందు కోసం ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు పెట్టుబడులు పెట్టారు. ఆగస్టులో నారు పోసుకోగా, ప్రస్తుతం దిగుబడులు మొదలయ్యాయి. కరెక్ట్‌గా అమ్ముకునే టైంలో ధర పడిపోవడంతో రైతులు నిండా మునుగుతున్నారు. టమాటాలు తెంపి మార్కెట్తీసుకుపోతే వ్యాపారులు రూ.2 నుంచి రూ.3 లోపే పెడ్తున్నారు. పది కిలోల బాక్సుకు రైతులకు రూ.25 నుంచి రూ.30లోపు మాత్రమే చెల్లిస్తున్నారు.
ఏపీ, కర్ణాటక నుంచి భారీగా దిగుబడులు..
ప్రస్తుతం కర్ణాటకలోని బంగారుపేట, కోలార్, బెంగళూరు నుంచి, ఏపీలోని కర్నూల్, అనంతపురం, నంద్యాల, బళ్లారి ప్రాంతాల నుంచి, మహారాష్ట్రలోని నాందేడ్, నాగపూర్‌లాంటి ఏరియాల నుంచి టమాట దిగుబడులు రాష్ట్రంలోకి భారీ ఎత్తున వస్తున్నాయి. అక్కడి రైతులకు సైతం కిలో టమాటాకు కేవలం రూపాయి మాత్రమే చెల్లిస్తుండడంతో గిట్టుబాటు కాక రోడ్లపై పారబోస్తున్నారు. పండ్లను తెంపకుండా తోటల్లోనే వదిలేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ టమాట వ్యాపారులు కర్నూల్‌లాంటి ప్రాంతాలకు వెళ్లి గంప గుత్తగా కిలోకు రూ.2 నుంచి రూ.3 వరకు చెల్లించి తెచ్చుకుంటున్నారు. ఒక బొలెరో లోడ్ టమాట నింపితే రైతులకు రూ.500 వరకు ఇస్తున్నారు. ఈ పంటను డీసీఎంలు, బొలెరో వాహనాల్లో మహబూబ్‌నగర్, హైదరాబాద్ ప్రాంతాలకు తరలించి, పది కిలోల బాక్సును స్థానిక మార్కెట్లో రూ.70 నుంచి రూ.75కు అమ్ముతున్నారు.
రూ.4 వేల నుంచి రూ.200కు పతనం
మూడు నెలల కింద క్వింటాల్ టమాటాకు రైతు రేటు రూ.4 వేల దాకా పలికింది. దీంతో సెప్టెంబరు వరకు మార్కెట్లో వ్యాపారులు కిలో టమాటాను ప్రజలకు రూ.50 వరకు అమ్మారు. అక్టోబర్‌లో మార్కెట్లలో కిలో టమాట రూ.40 కు పడిపోగా, రైతులకు కిలో కు రూ.30 చొప్పున చెల్లించారు. నవంబరు మొదటి, రెండు వారాల్లో కిలో టమాటాను మార్కెట్లో రూ.20కి అమ్మగా, రైతుకు కిలో రూ.10 చొప్పున చెల్లించారు. అదే నెల 20వ తేదీ నుంచి రేట్లను విపరీతంగా దించేశారు. పక్కనున్న ఏపీ, కర్ణాటక, మహారాష్ర్టాల నుంచి పెద్దమొత్తంలో పంటను దిగుమతి చేసుకుంటూ, ఇక్కడి రైతులకు కూడా అదే రేట్‌ను కట్టి నిండా ముంచుతున్నారు. ప్రస్తుతం క్వింటాల్ టమాటాకు రైతులకు రూ.200 నుంచి రూ.250 వరకు మాత్రమే చెల్లిస్తున్నారు.
తోటలను వదిలేస్తున్నారు..
పాలమూరు జిల్లాలోని మిడ్జిల్, బాలానగర్, రాజాపూర్, నవాబ్‌పేట, జడ్చర్ల మండలాల్లో అత్యధికంగా రైతులు టమాట సాగు చేస్తున్నారు. ఈ మండలాల నుంచి పంటను పాలమూరు, జడ్చర్ల మార్కెట్లకు తీసుకొస్తున్నారు. పది కిలోల టమాట బాక్సును మార్కెట్లకు తీసుకురావడానికి ఒక దానికి రూ.10 చొప్పున ఆటో డ్రైవర్లు తీసుకుంటున్నారు. ఈ లెక్కల బాక్సు టమాట అమ్మితే రూ.10 మాత్రమే మిగులుతోంది. అది కూడా చాయ్, టిఫిన్ ఖర్చు చేతి నుంచే పెట్టుకుంటున్నారు. దీంతో వారం రోజులుగా రైతులు పంటను తెంపడం లేదు. ప్రస్తుతం ఉన్న ధరలతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆటో కిరాయి పైసలు మిగుల్తలేదు
నాకున్న ఎకరాలో టమాట వేసిన. రేట్ మంచిగా వస్తదని అనుకున్న. పంట చేతికొస్తున్న టైంలో వ్యాపారులు రేట్ తగ్గించేసిన్రు. కిలో టమాటను రూ.2కు అడుగుతున్నరు. అందుకే వారికి పంటను అమ్మలేదు. నేను బాక్సుల్లో నింపుకొని మార్కెట్ తెచ్చి, నేరుగా అమ్ముకుంటున్న. చేసిన కష్టానికి కూలి కూడా గిడ్తలేదు. ఆటో కిరాయి పైసలు కూడా మిగుల్తలేవు.
- చంద్రమ్మ, టంకర, హన్వాడ మండలం
రేటు దింపి పరేషాన్ చేసిండ్రు
నాకున్న ఎకరా పొలంలో టమాట వేసిన. నారు పోయనింకి, కలుపు తీత, కూలీల ఖర్చులకు దాదాపు రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టిన. పోయిన వారం పండ్లను తెంపి మార్కెట్‌కు తీసుకుపోతే కిలో రూ.3కు అడిగిన్రు. అదే రేట్‌కు అమ్మేసి వచ్చిన. ఆటోలో టమాట తీసుకొచ్చినందుకు కిరాయి కూడా మిగలలేదు. అప్పటి నుంచి పండ్లను తెంపకుండా, తోటనే వదిలేసిన.
- ఆవుల నరేందర్, ఉడిత్యాల, బాలానగర్ మండలం