అప్పుడర్థమైంది ఎక్స్​పీరియెన్స్​ లేదని!

అప్పుడర్థమైంది ఎక్స్​పీరియెన్స్​ లేదని!

ఇప్పటి వరకు తీసింది మూడే సినిమాలు! కానీ, కథలో బలమైన యాక్షన్, దాన్ని నడిపించడానికి అవసరమైన ఎమోషన్, దాన్ని పీక్స్​కి తీసుకెళ్లడానికి హీరోకి ఇచ్చే ఎలివేషన్! ఇలా ఒక కొత్త ఫార్ములాతో ‘సినిమాను ఇంత గ్రాండ్​గా కూడా తీయొచ్చా?’ అనే ట్రెండ్ సెట్ చేశాడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ రెండు చాప్టర్ట్స్​ని జెన్ జెడ్ గుండెల్లో పెట్టుకుని ఆరాధించింది. కారణం, ఆయన తీసిన కొన్ని సీన్స్.. అవి ఊహకు అందవు!  అలా కళ్లార్పకుండా చూస్తూ ఫిదా అయిపోవాల్సిందే. కేజీఎఫ్ అనే ఒక తుపాన్ లాంటి మూవీని, రెండు చాప్టర్లుగా తీసి, కలెక్షన్ల వర్షంతో ప్యాన్ ఇండియాను షేక్ చేసిన కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ జర్నీ ఆయన మాటల్లోనే...
‘‘ సినిమా అనేది ఒక ఆర్ట్. ఒకసారి థియేటర్​ లోపలికెళ్లి సీట్​లో కూర్చుంటే, ఆడియన్స్ ఆ సినిమా ప్రపంచంలోకి వెళ్లిపోవాలి. అందుకు మ్యూజిక్ నుంచి మొదలుపెడితే విజువల్స్ వరకు అన్నీ కరెక్ట్ మూడ్​లో ఉండాలి. అలా ఆడియన్స్​ని ఆ క్యారెక్టర్​తో ప్రయాణం చేయించాలనుకుంటా. సినిమా తీసేటప్పుడు దాన్నే మనసులో పెట్టుకుని అందుకు తగ్గట్టు పనిచేస్తుంటా. ఇప్పుడు నా చేతిలో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి రెబల్ స్టార్ ప్రభాస్​తో చేస్తున్న ‘సలార్’. రెండోది జూనియర్ ఎన్టీఆర్​తో చేయబోతున్నా. 20 ఏండ్ల ముందు నుంచే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ నేను. ఈ ప్రాజెక్టు చేయాలని డిసైడ్ అవ్వడానికి ముందే మేం చాలా సార్లు కలుసుకున్నాం. గత రెండేండ్లు​గా మేం ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం. తారక్​కి నేను చెప్పిన కథ బాగా నచ్చింది. తనతో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని ఎగ్జైటెడ్​గా ఎదురు చూస్తున్నా. ఆ తర్వాత శ్రీ మురళితో  ఒక సినిమా చేయాలనుకుంటున్నా. యశ్​తో కూడా మరోసారి టై అప్ కావాలని ఉంది.

రైటర్ గా మొదలుపెట్టా

నాన్న సుభాష్​ నీలకంఠాపురం, అమ్మ భారతి. ప్రశాంత్​ నీల్​ పూర్తి పేరు ప్రశాంత్ నీలకంఠాపురం. సినిమా ఇండస్ట్రీకి వచ్చాక నీలకంఠాపురంలో ఉన్న మొదటి రెండు అక్షరాలు తీసుకొని ప్రశాంత్ నీల్​గా మార్చుకున్నా. మాది ఉమ్మడి కుటుంబం. మా ఫ్యామిలీలో అందరూ హోటల్ బిజినెస్​లో ఉన్నారు. నేను పుట్టింది కర్ణాటకలోని  హస్సన్ లోనే అయినా... ఫ్యామిలీ బిజినెస్ వల్ల మేం బెంగళూరులో సెటిలయ్యాం. నా చిన్నప్పుడు మా హోటల్​లో తరచూ షూటింగ్స్ జరిగేవి. షూటింగ్స్ చూడటానికి మా ఫ్యామిలీ అంతా వెళ్లేవాళ్లం. అలా చిన్నప్పుడే నాకు షూటింగ్స్​తో పరిచయమైంది. శేషాద్రిపురం కాలేజీలో డిగ్రీ చదివా. 2002లో డిగ్రీ అయిపోయాక ఏడేండ్లు రేస్ కోర్సులో రేసులు ఆడేవాడ్ని. వారానికి నాలుగు రోజులు ‘బెంగళూరు టర్ఫ్ క్లబ్’లో బెట్టింగ్ ఆడేవాడ్ని. ఇది నెగెటివ్ మెసేజ్. కానీ, ఆ ఏడేండ్లు నేను ఒక లక్ష్యం లేకుండా ఉన్నా. అయితే డైరెక్టర్ అవ్వాలనే కోరిక మాత్రం చిన్నప్పటి నుండీ ఉండేది. 

కాలేజీలో ఉన్నప్పుడు ఎక్కువగా వీడియో గేమ్స్, క్రికెట్ ఆడేవాడ్ని. ఖాళీ టైంలో రూమ్​లో ఒక్కడ్నే కూర్చొని కథలు రాసుకునేవాడ్ని. నాకు పుస్తకాలు చదివే అలవాటు ఉండటం వల్ల కథలు రాసేవాడ్ని. ఎంబీఏ అయిపోయాక, డబ్బులు సంపాదించడానికి ఏమేం మార్గాలున్నాయా అని ఆలోచించా. ఆ తరువాత ఇక రేస్ కోర్సు వదిలేయాలనిపించింది. సినిమాలే కరెక్ట్ అనిపించాయి. ఫిల్మ్ కోర్సు చేస్తే సినిమాల్లో అవకాశాలు ఈజీగా వస్తాయని బాంబే వెళ్లి ఫిల్మ్ మేకింగ్ కోర్సు కంప్లీట్ చేశా.

నా మొదటి సినిమా...

ఫిల్మ్ కోర్స్ చేసొచ్చాక అప్పటికే ఇండస్ట్రీలో ఉన్న మా బావ, యాక్టర్ శ్రీ మురళి దగ్గరికెళ్లి ‘నేను డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నా’ అని చెప్పా. అది విని షాక్ అయ్యాడు. ‘నేను సీరియస్​గా చెప్తున్నా’ అన్నా. ఆ తర్వాత శ్రీమురళి నటించిన ‘ఆ హుడుగి నీనే’ మూవీకి స్క్రీన్ ప్లే రాశా. ఆ మూవీకి రాశాక కానీ అర్థంకాలేదు రాయడంలో నాకు ఎక్స్​పీరియెన్స్​ లేదనే విషయం. ఆ సినిమాకు సరిగ్గా పని చేయలేకపోయాననే బాధ చాలా రోజులు వెంటాడింది. తర్వాత నా మైండ్ మార్చుకున్నా. ఆ సినిమా షూటింగ్​లో ఉన్నప్పుడు శ్రీ మురళి మ్యానరిజమ్స్​ని బాగా అర్థం చేసుకున్నా. ఆ మ్యానరిజమ్స్​కి తగ్గట్టు కథ తయారు చేసుకొని ఒక యాక్షన్ ఫిల్మ్ ప్రాజెక్టు తో అతడి దగ్గరికి వెళ్లా. అండర్ వరల్డ్ మాఫియా నేపథ్యంలో రాసిన ఆ కథ అతనికి బాగా నచ్చడం, వెంటనే షూటింగ్ కావడం... చాలా స్పీడ్​గా  జరిగిపోయాయి. ఆ సినిమానే ‘ఉగ్రమ్’ ​కొత్త డైరెక్టర్​ని కావడం వల్ల ‘ఉగ్రమ్’ తీయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. దాంతో మా అన్నయ్య ప్రదీప్ ఆ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు. ‘ఉగ్రమ్’ కమర్షియల్​గా పెద్ద సక్సెస్ అయింది. 2014లో అత్యధిక కలెక్షన్లు సాధించిన కన్నడ సినిమాల్లో ‘ఉగ్రమ్’ ఒకటి. తర్వాత ఒక సంవత్సరం గ్యాప్​లోనే నేను మూడు సినిమాలకు సైన్ చేశా. ముందుగా ఉగ్రమ్​కి సీక్వెల్ తీయాలనుకున్నాం. కానీ, దానికంటే ముందే కేజీఎఫ్ పట్టాలెక్కింది.

యాక్షన్ మూవీస్ ఇన్​స్పిరేషన్ తో...

70 ల్లో వచ్చిన యాక్షన్ మూవీస్ చూసి నేను చాలా ఇన్ స్పైర్ అయ్యా. ముఖ్యంగా ‘ది గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ’, ‘ఫర్ ఎ ఫ్యూ డాలర్స్ మోర్’ మూవీస్ ప్రభావం నాపై చాలా ఉంది. 70ల చివర్లో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయని, ఆ రికార్డు ఇప్పటి వరకు అలాగే ఉందని ఎక్కడో చదివా. తర్వాత దాని గురించి బాగా స్టడీ చేశా. అక్కడినుంచే కేజీఎఫ్​లోని ‘రాఖీ’ క్యారెక్టర్ డిజైన్ చేశా. పవర్ అనేది ఏమేం చెయ్యగలదో చెప్పాలనుకున్నా. హిస్టరీలో ఏ పవర్ ఫుల్ వ్యక్తినైనా తీసుకోండి... వాళ్లలో ఎవ్వరూ 40 ఏండ్ల వయసులో పవర్ ఫుల్​గా మారాలని కలలు కనలేదు. చిన్నప్పటి నుంచే ఆ కలకు పునాదులు వేసుకున్నారు. దురాశ, యాంబిషన్ ఈ రెండూ ఉన్న వ్యక్తి ఒక కమ్యూనిటీ తాలూకు ప్రాబ్లమ్స్ కంటే కూడా ఎక్కువ యూనివర్సల్ అవుతాడు. ఆ యూనివర్సల్ సబ్జెక్ట్ నుంచే కేజీఎఫ్ పుట్టింది.  

రైటర్ లాగే ఆలోచిస్తా

కేజీఎఫ్ స్క్రిప్ట్​ని ముందు ఒక రైటర్​గానే చూశా. ఎందుకంటే, ఒక కథను డైరెక్టర్​గా చూస్తే ప్రాక్టికల్​గా మారిపోతాం. దాంతో బడ్జెట్ గురించి ఆలోచిస్తూ... ఒక పెద్ద కలను కనడం ఆపేస్తాం! నేను ఈ కథ రాసుకునేటప్పుడే, రాబోయే పదేండ్లకు కూడా ఈ కథ సరిపడేలా ఉండాలనుకున్నా. అయితే, కథ రాసేటప్పుడు దానికి ‘కేజీఎఫ్’ అని పేరుపెట్టి మాత్రం రాయలేదు. అంతకుముందునుంచే సొంతంగా ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకునే ‘రాఖీ’ అనే ఒక యాంబిషియస్ క్యారెక్టర్ గురించి బాగా ఆలోచిస్తుండేవాడ్ని. తర్వాతే ఆ సామ్రాజ్యానికే ‘కేజీఎఫ్’ అని పేరు పెట్టా. అంటే కేజీఎఫ్ కంటే ముందే ‘రాఖీ’ వచ్చాడన్నమాట. అది కూడా చాలా యాక్సిడెంటల్​గా. ‘ఉగ్రమ్’ సెకండాఫ్ షూటింగ్ కోసం మేం ‘కోలార్ గోల్డ్ ఫీల్డ్స్’ కి వెళ్లాం. అక్కడ నాకు చాలా మంది, చాలా కథలు చెప్పారు. అవి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. ఆ కథలు విన్నాక ‘రాఖీ’ క్యారెక్టర్​కి కేజీఎఫ్​ని బ్యాక్ డ్రాప్​గా మార్చా.

ప్రొడ్యూసర్ సీరియస్​గా తీసుకున్నడు

ముందుగా ప్రొడ్యూసర్ విజయ్ కిర్ గంధూర్​కి ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ చెప్పా. అది కూడా వేరే యాక్టర్ కోసం. కానీ, ఆయన ‘నీ దగ్గర ఇంకేదైనా స్క్రిప్ట్ ఉందా?’ అని అడిగాడు. అప్పుడు కేజీఎఫ్ గురించి చెప్పా. ‘కానీ, అది మనకు వర్కవుట్ కాదు, బడ్జెట్ చాలా ఎక్కువవుతుంద’న్నా. అయినా సరే, స్టోరీ చెప్పమన్నాడు. అది ఆయనకు బాగా నచ్చడంతో కేజీఎఫ్ ప్రాజెక్ట్​కి అడుగులు పడ్డాయి. కేజీఎఫ్​కి ముందు యశ్​తో అంత పరిచయం లేదు. జస్ట్ తెలుసంతే. నా ఫస్ట్ మూవీ ‘ఉగ్రమ్’ సెలబ్రిటీ షో చూడటానికి యశ్ వచ్చాడు. అంతకుముందు యశ్ చేసిన ‘గూగ్లీ’ చూశా. ఆయనలో నేచురల్ టాలెంట్ ఉందని అప్పుడే అనుకున్నా. ‘ఈ సినిమాలో హీరోగా ఎవరిని తీసుకుందామ’ని ప్రొడ్యూసర్ విజయ్ అడిగినప్పుడు వెంటనే ‘యశ్ ఈ రోల్​కి ఫిట్ అవుతాడు’ అన్నా. ఈ సినిమా తీయాలనే ఆలోచనలో నేను లేనప్పుడే ఇవన్నీ జరిగిపోయాయి. ప్రొడ్యూసర్ దాన్ని సీరియస్​గా తీసుకున్నాడు, వెంటనే యశ్​ని కలిసి డేట్స్ కూడా తీసుకున్నాడు.

ఇంత పెద్ద హిట్ అవుతుందనుకోలేదు

కేజీఎఫ్ సినిమా తీస్తున్నప్పుడు ఇంత పెద్ద సినిమా అవుతుంది అనుకోలేదు. కన్నడలో పెద్ద స్టార్ అయిన యశ్​ని ఎంత బాగా ప్రజెంట్ చెయ్యాలి? అనే ఆలోచించాను. అంత బాగా ఎలివేట్ చేశాక కూడా జనాలు యాక్సెప్ట్ చేస్తారా అని భయపడ్డా. కానీ, ప్రేక్షకులు యాక్సెప్ట్ చేశారు. వాళ్లకు రాఖీ నచ్చాడు. రాఖీతో కలిసి వాళ్లు జర్నీ చేశారు.
:::  గుణ

నేను యాక్టర్స్ పై అస్సలు కోప్పడను. యాక్టర్స్ మూడ్ నాకు చాలా ఇంపార్టెంట్. సెట్స్​లో వాళ్లు హ్యాపీగా ఉండాలి. అప్పుడే వాళ్ల నుంచి వంద శాతం యాక్టింగ్ తీసుకోగలమని నమ్ముతా. ఇక, ఎడిటింగ్​ విషయానికి వస్తే అందులో చిన్న తప్పు ఉన్నా సినిమాకి మైనస్ అవుతుంది. ఇండస్ట్రీలో ఎంతోమంది సీనియర్ ఎడిటర్లు ఉన్నా, ‘కేజిఎఫ్-1’ కి పని చేసిన ఎడిటర్​ని కూడా కాదనుకొని ‘కేజిఎఫ్-2’ సినిమాని19 ఏండ్ల కుర్రాడు ఉజ్వల్ కులకర్ణి చేతిలో పెట్టా. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మా ప్రొడ్యూసర్ అయితే ‘రిస్క్ చేయొద్ద’న్నాడు. షార్ట్ ఫిలిమ్స్, ఫ్యాన్ వీడియోలు ఎడిట్ చేస్తుండే ఈ అబ్బాయి... ఒకసారి కేజీఎఫ్-1 ప్యాన్ వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. అది చూడగానే భలే ఉందనిపించింది. వెంటనే అతడిని పిలిపించా. కేజీఎఫ్-2 టీజర్ కట్ చేసి చూపించమన్నా. అది నాకు చాలా నచ్చింది. దాన్నే రిలీజ్ చేశాం. దానికి యూట్యూబ్​లో 250 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అతడి టాలెంట్ చూశాక ‘కేజీఎఫ్- 2’ సినిమా మొత్తం ఎడిట్ చేయమన్నా. ‘నేను చెయ్యగలనా సర్’ అని ఉజ్వల్ అడిగినప్పుడు... ‘పర్లేదు ధైర్యంగా చేయమన్నా.’. రిజల్ట్ చూశారు కదా? అతడి ఎడిటింగ్ వల్లనే  కేజిఎఫ్- 2 అంత అద్భుతంగా వచ్చింది. నాకు ఫర్ఫెక్ట్ టీం దొరికింది. ప్రొడ్యూసర్, యాక్టర్స్, టెక్నీషియన్స్ అందరూ ఫర్ఫెక్ట్​గా దొరికారు. అందుకే, కేజీఎఫ్-2 హిట్ అవుతుందని నాకు ముందే తెలుసు.

మంచి నాన్నగా ఉండలేకపోతున్నా 

నాది అరేంజ్డ్ మ్యారేజ్. ఒక పాప, ఒక బాబు ఉన్నారు. ఐదారేండ్లుగా వాళ్లకి  మంచి నాన్నగా ఉండలేకపోతున్నా. నాన్నను మిస్ అవుతున్నామనే ఫీలింగ్ పిల్లలకు రాకుండా నా వైఫ్​ లిఖిత చూసుకుంటోంది. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్​లో నేను పూర్తిగా ఆబ్సెంట్. ఆ క్రియేటివ్ స్పేస్ ఇచ్చినందుకు ఆమెకు నేనెప్పుడూ రుణపడి ఉంటా. నేను సంపాదించే పేరు ప్రతిష్టలన్నీ వాళ్లకే చెందుతాయి.  నాకు ఫలానా డ్రీమ్ ఉందనే విషయం ఇప్పుడు ఎవరికీ చెప్పను. అది నెరవేరిన రోజు అందరికీ తెలిసిపోతుంది.