భారత దౌత్యవేత్తలు లక్ష్యంగా ఖలిస్థాన్ బెదిరింపు పోస్టర్లు

భారత దౌత్యవేత్తలు లక్ష్యంగా ఖలిస్థాన్ బెదిరింపు పోస్టర్లు

కెనడాలో ఖలిస్థాన్ ఉగ్రవాదుల పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యకు భారత దౌత్యవేత్తలే కారణమంటూ కెనడాలో పోస్టర్లు వెలిశాయి. కిల్లింగ్‌ ఇండియా పేరిట టొరంటోలో వెలిసిన పోస్టర్లలో నిజ్జర్ను  దౌత్యవేత్తలు సంజయ్‌కుమార్‌ వర్మ, అపూర్వ శ్రీవాత్సవ హత్య చేశారంటూ పేర్కొనడం సంచలనం సృష్టిస్తోంది. అంతేకాకుండా జూలై 8న ఖలిస్థాన్‌ ఫ్రీడమ్ ర్యాలీని నిర్వహిస్తున్నట్టు పోస్టర్లలో పేర్కొన్నారు. ఈ ర్యాలీ టొరంటోలోని గ్రేట్‌ పంజాబ్‌ బిజినెస్‌ సెంటర్‌ నుంచి ప్రారంభమై టొరంటోలోని భారత కాన్సుల్‌ కార్యాలయం వద్ద ర్యాలీ ముగుస్తుందని అందులో తెలిపారు. 

కెనడాలోని ఒట్టావాలో ఉన్న ఇండియన్ హైకమిషన్ కార్యాలయం, టొరంటో, వాంకోవర్ నగరాల్లోని ఇండియన్ కాన్సులేట్ కార్యాలయాల వద్ద జులై 8న నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామని ఖలిస్థాన్ ఉగ్రవాదులు ప్రకటించడంతో .. భారత ప్రభుత్వం  స్పందించింది. జస్టిన్ ట్రుడు నేతృత్వంలోని కెనడా ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. సిక్కు ఉగ్రవాదులు భారత దేశ జాతీయ పతాకాన్ని అవమానించకుండా, ఇండియన్ మిషన్స్, కాన్సులేట్లకు సమీపంలో ఈ ఉగ్రవాదులు చేరుకోకుండా చర్యలు చేపట్టాలని కోరింది. అలాగే  ఈ కార్యాలయాల్లో పని చేసే దౌత్యవేత్తలు, ఇతర సిబ్బందికి ఎటువంటి నష్టం జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని సూచించింది. అలాగే  ప్రహరీ గోడలపై ఎటువంటి కరపత్రాలు అంటించకుండా, రాతలు రాయకుండా, ప్రొజెక్టైల్స్‌ను కార్యాలయాల్లోకి విసరకుండా చర్యలు తీసుకోవాలని కోరింది.

అమెరికాలోని సిక్స్ ఫర్ జస్టిస్  సంస్థకు చెందిన నేత హర్‌దీప్ సింగ్ నిజ్జర్‌ను కెనడాలోని వాంకోవర్‌లో జూన్ 19న హత్య చేశారు. ఇంటర్ గ్యాంగ్ ఘర్షణలో ఈ హత్య జరిగింది. అయితే ఖలిస్థాన్ ఉగ్రవాదులు మాత్రం ఇది భారత దేశ దౌత్యవేత్తల  పనేనని అని ఆరోపిస్తున్నారు. నిజ్జర్ హత్యకు  ఇండియన్ హై కమిషనర్ సంజయ్ కుమార్ వర్మ, వాంకోవర్ కాన్సుల్ జనరల్ మనీశ్, టొరంటో కాన్సుల్ జనరల్ అపూర్వ శ్రీవాస్తవ కారకులు అని కరపత్రాలను పంచుతోంది. 

శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత రాయబారి కార్యాలయంపై ఖలిస్తాన్ మద్దతుదారులు మరోసారి దాడి చేశారు. భారతీయ కాన్సులేట్‌పై జులై 1వ తేదీ శనివారం దాడిచేసి విధ్వంసం సృష్టించారు. గత ఐదు నెలల్లో ఈ తరహా దాడి జరగడం ఇది రెండవసారి. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. కెనడాకు చెందిన ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ మరణానికి సంబంధించి వార్తా క్లిప్పింగ్‌లు, అతని ఫోటోలు వీడియోలో కనిపించాయి. ఇండియాకు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉత్రవాదులలో ఒకడైన నిజ్జర్ తలపై రూ. 10 లక్షల రివార్డు కూడా ఉంది. గత నెలలో కెనడాలోని గురుద్వార వెలుపల జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిజ్జర్ హతమయ్యాడు.