అమెరికాలో ఇండియా అంబాసిడర్​ను అడ్డుకున్న ఖలిస్తానీలు

అమెరికాలో ఇండియా అంబాసిడర్​ను అడ్డుకున్న ఖలిస్తానీలు

న్యూయార్క్: అమెరికాలోని భారత అంబాసిడర్ తరంజిత్ సంధును న్యూయార్క్​లోని గురుద్వారా వద్ద ఖలిస్తాన్ అనుకూలవాదులు అడ్డుకున్నారు. గురునానక్ జయంతి సందర్భంగా లాంగ్ ఐలాండ్​లోని హిక్స్ విల్లే గురుద్వారాలో జరిగిన కార్యక్రమానికి హాజరైన సందర్భంగా నిరసన తెలిపారు. ప్రసంగం ముగియగానే తరంజిత్​ను చుట్టుముట్టారు. దాదాపు దాడి చేసినంతపని చేశారు. ఖలిస్తానీ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు కుట్ర పన్నారంటూ ఆరోపించారు.

మరో టెర్రరిస్ట్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కూడా కుట్ర పన్నింది మీరేనంటూ నినాదాలు చేశారు. సమాధానం చెప్పాలంటూ కొందరు నిలదీశారు. దీంతో తరంజిత్ కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్ స్పందించారు. నిరాధారమైన ఆరోపణలతో తరంజిత్​ సంధును ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించారని ట్విట్టర్​లో మండిపడ్డారు. ఈ ఘటన అనంతరం ఇండియా అంబాసిడర్ సంధూ.. తాను హిక్స్ విల్లే గురుద్వారాను సందర్శించానని, గురుపూరబ్ వేడుకల్లో పాల్గొన్నానని ట్వీట్ చేశారు.