ఖమ్మంలో ఘనంగా వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణ భూమిపూజ

ఖమ్మంలో ఘనంగా వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణ భూమిపూజ
  • త్రిదండి చిన్నజీయర్ స్వామి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు,
  • మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం, వెలుగు : టీటీడీ ఆధ్వర్యంలో ఖమ్మం సమీపంలోని అల్లీపురంలో వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి సోమవారం భూమిపూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆగమ సంప్రదాయాలకు అనుగుణంగా హోమాలు, ప్రత్యేక పూజలు, సంప్రోక్షణ చేసిన అనంతరం త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ భూమిపూజ జరిపారు. 

అనంతరం చిన్నజీయర్ స్వామి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిసి శ్రీవారి ఆలయ నిర్మాణ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. స్వామి వారి ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు, రాజగోపురం, పోటు (వంటశాల), ప్రాకారం, ప్రహరీగోడ నిర్మించనున్నారు. ఆలయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 20.04 ఎకరాల స్థలం కేటాయించగా.. టీటీడీ రూ. 89 కోట్లు మంజూరు చేసింది. 

భూమి పూజ కార్యక్రమం అనంతరం చిన్న జీయర్​స్వామి మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి భక్తులందరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఖమ్మంలో టీటీడీ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరగడం ఆనందంగా ఉందన్నారు. ఆలయ నిర్మాణం త్వరలోనే పూర్తై ఈ ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆలయాల నిర్మాణం చేపడుతున్నామని, రాబోయే ఏడాది కాలంలో ఐదు వేల ఆలయాలను నిర్మించాలనే ప్రణాళిక ఉందన్నారు. ఖమ్మంలో సుమారు రూ.100 కోట్ల విలువైన భూమిని టీటీడీకి కేటాయించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

 కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్​, కలెక్టర్ దివాకర్, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, మట్టా రాగమయి దయానంద్, టీటీడీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎ.శరత్, సీపీ సునీల్ దత్, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంత రావు, నేతలు రాయల నాగేశ్వర రావు, తుమ్మల యుగంధర్, సాదు రమేశ్ రెడ్డి పాల్గొన్నారు.