బాల్య వివాహాల నిర్మూలనకు చర్యలు చేపట్టాలి : గౌతమ్

బాల్య వివాహాల నిర్మూలనకు చర్యలు చేపట్టాలి : గౌతమ్

 ఖమ్మం టౌన్, వెలుగు : బాల్య వివాహాల నిర్మూలనకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్​ హాల్​లో మహిళా,శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారులతో బాల్య వివాహాల నిర్మూలన, బాలల సంక్షేమ సమితి, జిల్లా బాలల పరిరక్షణ విభాగం సంరక్షణలో ఉన్న శిశువుల వివరాలు, పిల్లల దత్తతపై ఆయన సమీక్షించారు.

బాల్యవివాహాలు జరగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే ఎఫ్ఐఆర్ చేయాలన్నారు.  పిల్లల దత్తతకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారికి అవగాహన కల్పించాలని సూచించారు. ఆపరేషన్ స్మైల్ అండ్ ముస్కాన్లు,  రెస్క్యూ అయిన పిల్లల స్థితిగతులు తెలుసుకున్నారు. జిల్లా సంక్షేమ అధికారి రాంగోపాల్ రెడ్డి, డీసీపీవో విష్ణు వందన, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు లక్ష్మయ్య, లింగయ్య, అనిత పాల్గొన్నారు.

విధుల పట్ల అవగాహన ఉండాలి

సెక్టార్ అధికారులు తమ విధులు పట్ల పూర్తి అవగాహన ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ సూచించారు. శుక్రవారం న్యూ కలెక్టరేట్ లోని మీటింగ్​ హాల్​లో సెక్టార్ అధికారులు, సెక్టార్ పోలీస్ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో సీపీ సునీల్ దత్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ సెక్టార్ అధికారుల మూడు అంచెల విధులను వివరించారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాలపై స్పెషల్​ ఫోకస్​ పెట్టాలని సూచించారు.

పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఒక సెక్టార్ అధికారికి గరిష్ఠంగా 12 పోలింగ్ కేంద్రాల కేటాయింపు ఉంటుందని చెప్పారు. సి-విజిల్ యాప్ పై ప్రచారం కల్పించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్లు బీ.సత్యప్రసాద్, డీ.మధుసూదన్ నాయక్, ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణా సహాయ కలెక్టర్లు మయాంక్ సింగ్, యువరాజ్, శిక్షణా ఐపీఎస్ మౌనిక, అడిషనల్​ డీసీపీ జి. ప్రసాద రావు, జిల్లా స్వీప్ నోడల్ అధికారి కె. శ్రీరామ్, ఆర్డీవోలు, ఏసీపీలు, సెక్టార్ అధికారులు పాల్గొన్నారు.