
భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం టౌన్, వెలుగు : అర్జీదారుల సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, భద్రాద్రికొత్తగూడెం అడిషనల్ కలెక్టర్ డాక్టర్ పి.రాంబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయా కలెక్టరేట్లలో నిర్వహించిన గ్రీవెన్స్ డే లో అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులపై తీసుకున్న చర్యా నివేదికలను ఇవ్వాలని కోరారు. కొత్తగూడెం మున్సిపాల్టీలోని గడ్డం శకుంతల తనకు 14వ వార్డులో డబుల్ బెడ్ రూమ్ మంజూరైందని, ఎన్ని సార్లు అధికారులను కలిసినా రేపు, మాపు అంటూ కాలయాపన చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. మర్కోడు పంచాయతీ నుంచి కొమరారం బాయక్క తనకు 9.3 గుంటల వ్యవసాయ భూమి ఉందని, రైతుబంధు వచ్చినా రూ.2వేలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి చెక్కు తీసుకుని వ్యవసాయాధికారులు నేటికీ ఇవ్వడం లేదని వాపోయారు. ఇలా వచ్చిన ప్రతీ సమస్యను ఆయా శాఖలకు పరిష్కారం కోసం సిఫార్సు చేస్తున్నామన్నారు. ఖమ్మంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.సత్యప్రసాద్, భద్రాద్రికొత్తగూడెంలో డీఆర్వో రవీంద్రనాథ్, డీఆర్డీవో మధుసూదన్‌రాజు, ఆఫీసర్లు పాల్గొన్నారు.