పోడు భూముల వివాదంలో ఉద్రిక్తత.. అటవీ శాఖ అధికారులు, గిరిజనుల మధ్య తోపులాట.. ఖమ్మం జిల్లాలో ఘటన

పోడు భూముల వివాదంలో ఉద్రిక్తత.. అటవీ శాఖ అధికారులు, గిరిజనుల మధ్య తోపులాట.. ఖమ్మం జిల్లాలో ఘటన
  • మహిళా ఫారెస్ట్ ఆఫీసర్​ చేతికి గాయం
  • ఇద్దరు గిరిజనులను అదుపులోకి తీసుకున్న అధికారులు

సత్తుపల్లి, వెలుగు: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని కాకర్లపల్లి బీట్ పరిధిలో పోడు భూముల వివాదం మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. తామరచెరువు సమీపంలోని అటవీ ప్రాంతంలో సోమవారం అటవీ శాఖ అధికారులు, పోడు సాగుదారుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు గిరిజనులను అధికారులు అదుపులోకి తీసుకోగా, ఓ మహిళా అటవీ అధికారికి గాయాలైనట్లు సమాచారం. 

కాకర్లపల్లి బీట్ పరిధిలోని కంపార్ట్మెంట్ నంబర్–157లో సుమారు 10.5 హెక్టార్ల భూమిపై కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ భూమి ప్రభుత్వ అటవీ భూమి అని అటవీ శాఖ అధికారులు చెబుతుండగా, తాము ఏళ్లుగా సాగు చేస్తున్న పోడు భూమి అని గిరిజనులు వాదిస్తున్నారు. అటవీ భూముల్లోకి ప్రవేశాన్ని అడ్డుకునేందుకు అధికారులు ఇటీవల ట్రెంచ్ తవ్వారు.

 అయితే పోడు సాగుదారులు ట్రెంచ్‌‌‌‌ను పూడ్చివేసి భూముల్లోకి ప్రవేశించి సాగు పనులు చేపట్టినట్లు అధికారులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోడు సాగు చేస్తున్న ఇద్దరు గిరిజనులను అధికారులు అదుపులోకి తీసుకుని జీపులో తరలించేందుకు ప్రయత్నించారు. 

దీనికి నిరసనగా గిరిజన మహిళలు జీపుకు అడ్డంగా నిలబడి వాహనాన్ని అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరగగా కొందరు పోడు సాగుదారులు కిందపడిపోయారు. తోపులాటలో ఓ మహిళా అటవీ అధికారికి చేతికి గాయమైనట్లు తెలిసింది. ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, అధికారులు అదుపులోకి తీసుకున్న గిరిజనులను జీపులో తరలించారు.