ఖమ్మం టౌన్, వెలుగు : భ్రూణ హత్యలు చట్టరీత్యా నేరమని, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డి. రామారావు హెచ్చరించారు. బుధవారం ఖమ్మం నగరంలోని సమత నర్సింగ్ హోమ్, సత్య స్కానింగ్, సిరిన్ స్కానింగ్ సెంటర్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రేడియోలాజిస్ట్, గైనకాలజిస్ట్ పీసీపీఎన్డీటీ చట్టం నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు.
స్కానింగ్ చేసేటప్పుడు గర్భిణీ అనుమతి పత్రాన్ని 'ఫాం-ఎఫ్' తో జత చేయాలని సూచించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయబడవనే బోర్డులను వెయిటింగ్ హాల్‌లో ప్రదర్శించాలని ఆదేశించారు. ప్రతినెలా నివేదికలను ఆన్‌లైన్‌లో సమర్పించాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఆడపిల్లల శాతం తగ్గిపోతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. స్కానింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా ఉందని, నిబంధనలు ఉల్లంఘిస్తే క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డాక్టర్లు నైతికంగా వ్యవహరించాలని, స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో లేని సమయంలో స్కానింగ్ గదులకు తాళం వేసి ఉంచాలన్నారు.
