
- మూడో జోన్ నుంచి, రెండో జోన్ కు మారనున్న భూములు
- మూడు పంప్ హౌజ్ ల ద్వారా నీటి తరలింపు
- మధిర, ఎర్రుపాలెం మండలాల్లో 30 వేల ఎకరాలకు లబ్ది
ఖమ్మం, మధిర, వెలుగు : ఖమ్మం జిల్లాలో చివరి ఆయకట్టు భూములకు వైరా నది జలాలు అందేలా ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఇప్పటి వరకు మూడో జోన్ కింద ఉన్న మధిర, ఎర్రుపాలెం మండలాలను రెండో జోన్ కిందకు తీసుకువచ్చేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఇందుకోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చొరవతో రూ.630 కోట్లతో వైరా నదిపై మధిర మండలం వంగవీడు దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని డిజైన్ చేశారు. దీనికి జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గా పేరుపెట్టారు. మూడు పంప్ హౌజ్ లను నిర్మించడం ద్వారా మధిర, ఎర్రుపాలెం మండలాల్లో 50 వేల ఎకరాలకు సాగు నీరందించనున్నారు.
దీంతో ఖమ్మం జిల్లాలో 17 మండలాల్లో ఉన్న ఆయకట్టు మొత్తం రెండో జోన్ గా మారనుంది. జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి వాకిటి శ్రీహరి కలిసి శంకుస్థాపన చేస్తారని ముందుగా అధికారులు ప్రకటించారు. హైదరాబాద్ లో ఈనెల 4న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే మీటింగ్ నేపథ్యంలో ఈ శంకుస్థాపన కార్యక్రమం వచ్చే వారానికి వాయిదా పడిందని తెలిపారు.
ఇన్నేండ్లుగా అరకొర నీళ్లే..!
ఖమ్మం జిల్లాలో నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద రెండున్నర లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అప్పటి పరిస్థితుల దృష్ట్యా మధిర, ఎర్రుపాలెం మండలాలను జోన్ 3 గా విభజించారు. గ్రావిటీ ద్వారా మధిర, ఎర్రుపాలెం మండలాల్లోని ఆయకట్టుకు నీరందాలంటే ఏపీలోని 30 కిలోమీటర్ల ప్రవాహం తర్వాత తిరిగి తెలంగాణలోని ఆయకట్టుకు నీరందుతోంది. ఇదంతా కాల్వల చివరి భూములు కావడంతో ప్రతిఏటా ఆయకట్టు 18 వేల ఎకరాల్లో సాగునీరందక రైతులు ఇబ్బందిపడుతున్నారు.
ఎండాకాలం పంటలు నీరు రాక ఎండిన సందర్భాలు, నీటి కోసం రైతులు ఆందోళన చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమ భూములను జోన్ 2 లోకి మార్చాలని ఇక్కడి రైతులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవతో ప్రత్యామ్నాయాలను డిజైన్ చేశారు. వాటిని పరిశీలించిన తర్వాత వైరా నదిపై వంగవీడు దగ్గర లిఫ్ట్ ను ఫైనల్ చేశారు.
నీటి సరఫరా ఇలా..!
మధిర మండలం వంగవీడు దగ్గర వైరా నదిపై చెక్ డ్యామ్ నిర్మించి, ఆ నీటిని సాగర్ కాల్వలకు మళ్లించనున్నారు. వంగవీడు దగ్గర నుంచి మూడు మోటార్లను బిగించనున్నారు. ఒక మోటార్ ద్వారా నీటిని లిఫ్ట్ చేసి మైలవరం బ్రాంచ్ కెనాల్ నరసింహపురం గ్రామం వద్ద నాగార్జునసాగర్ మెయిన్ కెనాల్ కు నీటిని పంప్ చేయనున్నారు. రెండో మోటార్ నీటిని పైప్ లైన్ ద్వారా ఎర్రుపాలెం మండలం జమలాపురం మేజర్ గుంటుపల్లి గోపవరం వద్ద ఎన్ఎస్పీ కాల్వలోకి రెండో పంప్ హౌజ్ ద్వారా నీటిని పంప్ చేస్తారు.
మూడో పంప్ హౌజ్ ద్వారా మధిర మండలం నాగవరపాడు దగ్గర ఎన్ఎస్పీ కెనాల్ లో నీటిని పంప్ చేయనున్నారు. ఇప్పటికే ఉన్న జమలాపురం మేజర్, నిదానపురం మేజర్, మూలపాడు మేజర్ కాల్వలను ఉపయోగించుకొని సాగునీటిని అందించనున్నారు. మూడు మోటార్ల ద్వారా 150 నుంచి 200 క్యూసెక్కుల నీటిని తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీటి నిర్మాణం పూర్తయితే ఇప్పటికే ఉన్న 18 వేల ఎకరాల ఆయకట్టుకు అదనంగా మరో 30 వేల ఎకరాలకు లబ్ది జరుగుతుందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.
ఇకపై రెండు పంటలకు నీరు
వంగవీడు ఎత్తిపోతల పథకంతో మా ప్రాంతంలో రైతులు రెండు పంటలు సాగు చేసుకునేందుకు నీరు అందనుంది. ఎర్రుపాలెం, మధిర మండలాల్లో చివరి గ్రామం వరకు నీళ్లు వచ్చే విధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆలోచన చేయడం సంతోషంగా ఉంది. నీళ్లు లేక వ్యవసాయం చేయలేమని అనుకుంటున్న రోజుల్లో ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల భవిష్యత్ తరాల వారు కూడా వ్యవసాయం దండగ కాదు.. పండుగ లాగా చేసుకోవచ్చని ఆశ చిగురించింది.
పులిబండ్ల చిట్టి బాబు, సైదెల్లిపురం
ఇక చివరి ఆయకట్టు భూములకూ ఢీకా లేదు..
జమలాపురం మేజర్ చెరువు పై లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టడం ద్వారా రైతుల చిరకాల వాంఛ తీరనుంది. నాకు రెండు ఎకరాల భూమి ఉన్నది. గతంలో జోన్-3 కి నీళ్లు వదిలితే ఆంధ్ర ప్రాంతానికి వెళ్లి నీరు తిరిగి వచ్చేవరకు వేచి చూడాల్సివచ్చేది. చివరి ఆయకట్టు భూములు కావడంతో వస్తాయో రావో కూడా తెలియని పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఈ ప్రాంత రైతుల సమస్య తీరే పరిస్థితి ఉన్నది.
ఆవుల వెంకటరామయ్య, తెల్లపాలెం