ఖమ్మం టౌన్, వెలుగు: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు ఖమ్మంలో నిర్మిస్తున్న వ్యవసాయ మోడల్ మార్కెట్ షెడ్లలో మక్కలు నిల్వ చేసుకునేందుకు అవకాశం కల్పించడంపై మార్కెట్ కమిటీ చైర్మన్ ఎరగర్ల హన్మంతరావు, వైస్ చైర్మన్ తల్లడ రమేశ్ హర్షం వ్యక్తం చేశారు. సోమవారం చైర్మన్ ఛాంబర్ లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ కొత్తగా నిర్మిస్తున్న 4 షెడ్లలో 7 లక్షల బస్తాలతో 40 వేల మెట్రిక్ టన్నుల మక్కనిల్వకు కలెక్టర్ దివాకర సర్య్కూలర్ జారీ చేసినట్లు పేర్కొన్నారు.
జిల్లాలోని 5 నియోజకవర్గ వర్గాల నుంచి వచ్చే మక్కజొన్న వర్షానికి ఏమాత్రం తడవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 11 పీఎంసీలతో పరీక్షలు చేసి పారదర్శకంగా మార్క్ఫెడ్ అధికారులు చర్యలు చేపడతారన్నారు. రెండు నెలల వరకు ఖమ్మం మోడల్ మార్కెట్ షెడ్లను మక్కజొన్న నిల్వ చేసుకోవచ్చన్నారు. ఇప్పటికే రైతుల మౌలిక వసతులకు తగ్గట్లుగా 15 ఎకరాల్లో రూ.155 కోట్లతో నిర్మిస్తున్న మోడల్ వ్యవసాయ మార్కెట్ 75 శాతం కంప్లిట్ అయినట్లు తెలిపారు. సమావేశంలో మార్కెట్ గ్రేడ్ వన్ సెక్రెటరీ ప్రవీణ్ కుమార్ రెడ్డి, అసిస్టెంట్ సెక్రెటరీ వీరాంజనేయులు, కమిటీ డైరెక్టర్లు పాల్గొన్నారు.
