కర్నాటక చేరిన ఖమ్మం పంచాది!

కర్నాటక చేరిన ఖమ్మం పంచాది!
  •  బెంగళూరులో ఖర్గేతో భట్టి, పొంగులేటి భేటీ
  • అక్కడి నుంచి తుమ్మలకు ఫోన్​ 
  • ఏకాభిప్రాయం తెచ్చేందుకు ఏఐసీసీ కసరత్తు
  • రఘురాంరెడ్డి పేరు ఫైనల్ చేసినట్టు ప్రచారం 

ఖమ్మం, వెలుగు:  ఖమ్మం లోక్​సభ కాంగ్రెస్​ టికె ట్ విషయంలో నెలరోజుల కసరత్తు క్లైమాక్స్​కు చేరింది. టికెట్​ కోసం పోటీపడుతున్న ముగ్గురు మంత్రుల మధ్య ఏకాభిప్రాయాన్ని తెచ్చేందుకు ఏఐసీసీ తుది ప్రయత్నాలు చేసింది. బెంగళూరులో సోమవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి సమావేశమయ్యారు.

అక్కడి నుంచే మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఖర్గే ఫోన్​ చేసి ఆయన అభిప్రాయాన్ని కూడా తీసుకున్నారు. తన భార్య నందిని కోసం భట్టి విక్రమార్క, కొడుకు యుగంధర్ ​కోసం తుమ్మల, తమ్ముడు ప్రసాద్​ రెడ్డి కోసం పొంగులేటి పట్టుబట్టడంతో ఖమ్మం టికెట్​ విషయంలో పీటముడి పడింది. ఈ ముగ్గురిని తప్పించి మిగిలిన అభ్యర్థులపై చర్చలు, రకారకాల ఈక్వెషన్లను హైకమాండ్​ వర్కవుట్ చేసింది.

మండవ వెంకటేశ్వరరావు వంటి నాన్​లోకల్​అభ్యర్థులను కూడా పరిశీలనలోకి తీసుకుంది. వ్యాపారవేత్త వీవీసీ రాజేంద్రప్రసాద్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్, సీనియర్​ లీడర్లు వీహెచ్​, రాయల నాగేశ్వరరావు, పోట్ల నాగేశ్వరరావు పేర్లు కూడా చక్కర్లు కొట్టాయి. భట్టి, పొంగులేటి పట్టువీడకపోవడంతో మళ్లీ మంత్రుల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు చేసింది.

ఇందులో భాగంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్​కూడా రంగంలోకి దిగి భట్టి, పొంగులేటితో మాట్లాడారు. మంత్రుల ఫ్యామిలీ మెంబర్స్​ను పక్కనబెట్టాలనే నిర్ణయం తీసుకోవడంతో చివరకు రాయల నాగేశ్వరరావు పేరును భట్టి విక్రమాwర్క, రామసహాయం రఘురాంరెడ్డి పేరును పొంగులేటి ప్రపోజ్​ చేసినట్టు సమాచారం. నామినేషన్ల దాఖలుకు ఈనెల 25వరకు మాత్రమే సమయం ఉండడంతో తుది నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కొద్ది గంటల్లో లిస్ట్ రిలీజ్​ చేస్తారని ప్రచారం జరుగుతోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి వియ్యంకుడు రామసహాయం రఘురాంరెడ్డిని క్యాండిడేట్​గా ఫైనల్​ చేసినట్టు సమాచారం.