ఖమ్మం పాలిటిక్స్ కేసులు..కబ్జాల చుట్టే..

ఖమ్మం పాలిటిక్స్ కేసులు..కబ్జాల చుట్టే..

ఖమ్మం, వెలుగు :  ఖమ్మం అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కేసులు, కబ్జాల చుట్టూ తిరుగుతోంది. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య టఫ్​ ఫైట్​నడుస్తున్నది. బీఆర్ఎస్ అభ్యర్థిగా రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బరిలో ఉన్నారు. వీళ్లిద్దరి మధ్య ల్యాండ్ కబ్జాలు, అక్రమాలు, అరాచకాలు, కేసుల విషయమై డైలాగ్ వార్ నడుస్తోంది.

 ఐదేండ్లలో రూ.మూడు వేల కోట్ల అభివృద్ధి చేశామని పువ్వాడ అజయ్ చెప్తుండగా, డెవలప్ మెంట్ పనుల్లో కమిషన్లు, ప్రత్యర్థులపై రాజకీయ ప్రేరేపిత కేసుల విషయాన్ని తుమ్మల లేవనెత్తుతున్నారు. గతంలో ఉన్న చందాలు, దందాల సంస్కృతిని ఖమ్మంలో లేకుండా చేశానని పువ్వాడ అజయ్ కౌంటర్ ఇస్తూనే తాను ఖమ్మం భూమి పుత్రుడిగా చెప్పుకుంటున్నారు. లోకల్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి రాత్రయినా ఖమ్మంలోనే ఉంటానని, తుమ్మల మాత్రం సాయంత్రమైతే హైదరాబాద్ గానీ, గండుగులపల్లిగాని వెళ్తారని చెప్తున్నారు. 

దీనికి తుమ్మల సైతం తనదైన శైలిలో కౌంటర్ ఇస్తున్నారు. కూనవరంలో పుట్టిన వ్యక్తి లోకల్ ఎలా అవుతారని నిలదీస్తున్నారు. మరోవైపు పాలేరు చెల్లని రూపాయి ఖమ్మంలో చెల్లుతుందా అని అజయ్ ప్రశ్నిస్తుండగా, తాను అమెరికన్ డాలర్ లాంటివాడినని ఎక్కడైనా చెల్లుతానని తుమ్మల రివర్స్​అటాక్​చేస్తున్నారు.  

అజయ్​ లక్ష్యంగా కాంగ్రెస్ దాడి

అనూహ్య పరిస్థితుల్లో ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన తుమ్మల, మెయిన్ గా మంత్రి అజయ్ నే టార్గెట్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో ఖమ్మంలో అరాచక పాలన సాగుతోందని, అధికార పార్టీ నేతలు భూ కబ్జాలు చేస్తున్నారని, ప్రత్యర్థులపై కేసులతో వేధించారంటూ ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు తీసుకున్నారని, పోలీస్ రాజ్యం నడుస్తోందని ప్రత్యర్థిపై పొలిటికల్ దాడికి దిగారు. అజయ్ మంత్రి అయిన తర్వాత నియోజకవర్గంలో ఆయన అనుచరులు, కార్పొరేటర్ల సెటిల్మెంట్లకు, దందాలకు అడ్డు లేకుండా పోయిందని, కొందరు పోలీస్ అధికారులను అడ్డుపెట్టుకొని అరాచక పాలన సాగించారంటూ ప్రచారం చేస్తున్నారు. 

ఈ అరాచకపాలన ముగించాలంటే కాంగ్రెస్ కు ఓటెయ్యాలంటూ అభ్యర్థిస్తున్నారు. గతంలో తాను మంత్రిగా చేసిన అభివృద్ధి పనులను చెప్పుకుంటూ, మళ్లీ అవకాశమివ్వాలని కోరుతున్నారు. ఖమ్మంలో ఇప్పుడు చెబుతున్న అభివృద్ధి పనులన్నీ తాను మంత్రిగా ఉన్న టైంలో మొదలుపెట్టినవేనని అంటున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున ఖమ్మం నుంచి పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు ఆ ఎలక్షన్లలో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన అజయ్ పై ఓడిపోయారు. తర్వాత వీరిద్దరి మధ్య ముఖాముఖి పోరు జరగలేదు. గత ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని తుమ్మల కసిగా ఉన్నారు.

బీఆర్ఎస్ ఎదురుదాడి

కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు చేస్తున్న ఆరోపణలకు మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ దీటుగా కౌంటర్ ఇస్తున్నారు. తనకంటే ముందు ఖమ్మంలో చందాలు, దందాల సంస్కృతి ఉండేదని చెబుతున్నారు. రౌడీషీటర్లపై కేసులు పెడితే తప్పా అని ప్రశ్నిస్తున్నారు. కావాలని కుట్ర ప్రకారమే తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా తుమ్మల ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేశానని, రూ.3 వేల కోట్లతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో డెవలప్ చేశానని చెబుతున్నారు. 

తాను చేసిన అభివృద్ధిని కూడా తుమ్మల చేశాడని చెప్పుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. తుమ్మల హయాంలో ఆయన చుట్టూ కేవలం కాంట్రాక్టర్లు మాత్రమే కోటరీ కట్టేవారని, ఆయన్ని కలవాలంటే కోటరీని దాటుకొని వెళ్లాల్సి ఉండేదని గుర్తుచేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, మంత్రిగా చేసిన అభివృద్ధిని గమనించి తనకు మళ్లీ ఛాన్స్ ఇవ్వాలని అజయ్ రిక్వెస్ట్ చేస్తున్నారు. అదే సమయంలో 2014 ఎన్నికల్లో తాను పోటీచేసిన మొదటి సారే తుమ్మలను ఓడించానని, అప్పుడు ఖమ్మం వదిలి పారిపోయి ఇంకెక్కడా అవకాశం దొరక్క తుమ్మల ఖమ్మం వచ్చారు తప్ప, తుమ్మలకు ఖమ్మంపై ప్రేమ లేదని అజయ్ చెబుతున్నారు. 

గత చరిత్ర ఇదీ .. 

నియోజకవర్గంలో ఖమ్మం నగరంలోని 60 డివిజన్లతో పాటు రఘునాథపాలెం మండలం ఉంది. నియోజకవర్గంలో 3,22,996 మంది ఓటర్లుండగా, 1,54,978 మంది పురుషులు, 1,67,969 మంది మహిళలు, 49 మంది ఇతరులున్నారు. ఈ సెగ్మెంట్ లో 1952 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ రెండుసార్లు, కాంగ్రెస్ మూడుసార్లు, సీపీఎం ఐదుసార్లు, సీపీఐ మూడుసార్లు, టీడీపీ, టీఆర్ఎస్ ఒక్కసారి గెలిచాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఖమ్మం సెగ్మెంట్ నుంచి అజయ్ ఇప్పటికే రెండుసార్లు గెలిచి హ్యాట్రిక్ పై కన్నేశారు. 

2014 ఎలక్షన్లలో కాంగ్రెస్ తరపున గెలిచిన అజయ్, ఆ తర్వాత అప్పటి టీఆర్ఎస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో రెండోసారి గెలిచిన తర్వాత మంత్రి పదవి చేపట్టారు. ఇక తుమ్మల నాగేశ్వరరావు 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీచేసి ఓడిపోయారు. తర్వాత టీఆర్ఎస్ లో చేరి, ఎమ్మెల్సీ అయ్యారు. మంత్రిగా ఉన్న తర్వాత పాలేరు ఉప ఎన్నిక ఛాన్స్ రావడంతో అక్కడి నుంచి 2016లో జరిగిన ఎన్నికల్లో గెలిచారు. 2018 ఎలక్షన్లలో పాలేరులో ఓడిపోయిన తర్వాత జరిగిన పరిణామాల్లో మూడు నెలల క్రితం కాంగ్రెస్ లో చేరారు. పాలేరు టికెట్ ఆశించినా పార్టీ హైకమాండ్​ఆదేశాల మేరకు ఖమ్మం నుంచి తుమ్మల పోటీలో నిలిచారు. ఇక బీజేపీ బలపరిచిన జనసేన అభ్యర్థి మిరియాల రామకృష్ణ, సీపీఎం అభ్యర్థి యర్రా శ్రీకాంత్ కూడా పోటీలో ఉన్నారు.