మాజీ మంత్రి తుమ్మల ముఖ్య అనుచరుడి హత్య

మాజీ మంత్రి తుమ్మల ముఖ్య అనుచరుడి హత్య
  • తమ్మినేని కృష్ణయ్య సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు వరుస సోదరుడు
  • మాజీ మంత్రి తుమ్మల ముఖ్య అనుచరుడి హత్యతో కలకలం

ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ నాయకుడు తమ్మినేని కృష్ణయ్యను దుండగులు దారుణంగా హత్య చేశారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ముఖ్య అనుచరుడిగా ఉన్నారు కృష్ణయ్య. మృతుడు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు వరుసకు సోదరుడు అవుతాడు. జిల్లాలోని తెల్దారుపల్లిలో ఘటన జరిగింది. స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా తెల్లారిపల్లిలో జాతీయ జెండాను తమ్మినేని కృష్ణయ్య ఆవిష్కరించారు. ఆ తర్వాత కౌటాలపల్లి గ్రామానికి వస్తుంటే.. దుండగులు ఆటోను రోడ్డుపై అడ్డంగా నిలిపి అటకాయించారు. ఆ తర్వాత కృష్ణయ్యపై బండరాళ్లు, కత్తులతో దాడి చేసినట్టు తెలుస్తోంది. 

తీవ్ర రక్తస్రావం కావడంతో తమ్మినేని కృష్ణయ్య స్పాట్ లోనే చనిపోయారు. దారుణహత్య గురించి తెలిసి చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన జనం భారీ సంఖ్యలో ఘటనా స్థలానికి తరలివచ్చారు. అధికార పార్టీ నాయకుడి హత్య గురించి తెలిసిన వెంటనే పోలీసులు భారీ సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. లా అండ్ ఆర్డర్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ మృతదేహాన్ని పరిశీలించి హత్య జరిగిన తీరుపై విచారణ చేపట్టారు. ఇప్పటికే అనుమానితుల కోసం గాలింపు చేపట్టామని.. ముందు జాగ్రత్తగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని డీసీపీ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. 

తమ్మినేని వెంకటేశ్వరరావు ఇళ్లు ధ్వంసం

తమ్మినేని కృష్ణయ్య కృష్ణ హత్యకు కారకులైన వారి కోసం డాగ్ క్లూస్ టీంను రంగంలోకి దింపారు. డాగ్ క్లూస్ టీం తెల్దారుపల్లి గ్రామానికి చేరుకుంది. తమ్మినేని వీరభద్రం సోదరుడు తమ్మినేని కోటేశ్వరరావు ఇంటి ముందు డాగ్ ఆగడంతో గ్రామస్తులు ఆగ్రహంతో రగిలిపోయారు. తమ్మినేని కోటేశ్వరరావు ఇంటిని ధ్వంసం చేశారు.