జాతీయ నేతల ఖమ్మం టూర్​

జాతీయ నేతల ఖమ్మం టూర్​
  • మహాజన్ ​సంపర్క్​ అభియాన్​లో భాగంగా  ఈ నెల15న అమిత్ షా టూర్​
  • భట్టి పాదయాత్ర ముగింపు సభకు 25న రాహుల్ గాంధీ రాక

ఖమ్మం, వెలుగు : రాష్ట్ర రాజకీయాల్లో ఖమ్మం జిల్లా పాలిటిక్స్ మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. రెండు జాతీయ పార్టీలకు చెందిన అగ్ర నేతలు ఈ నెలలోనే జిల్లా టూర్​కు వస్తున్నారు. పది రోజుల గ్యాప్​తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ ఖమ్మం రానున్నారు. రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా నాలుగైదు నెలల టైమ్ ఉండగానే, ఒకే నెలలో రెండు జాతీయ పార్టీల నేతల బహిరంగ సభలకు ఖమ్మం వేదికగా మారడంతో ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

ఇదే సమయంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి రాజకీయ భవిష్యత్​కు, ఈ మీటింగ్ లకు ఏదైనా కనెక్షన్​ ఉందా అనే కోణంలో చర్చ జరుగుతోంది. ఏ పార్టీలోకి వెళ్లేది ఆయన ఇప్పటివరకు ప్రకటించకపోవడంతో ఈ బహిరంగ సభలు, జాతీయ నేతల రాక సందర్భంలో పొంగులేటి కూడా తన నిర్ణయాన్ని ప్రకటిస్తారనే అంచనాలున్నాయి. ఇప్పటికే ఒక జాతీయ పార్టీతో తొలి దశ సంప్రదింపులు పూర్తయ్యాయని, మరో వారంలో పూర్తి క్లారిటీ వస్తుందని పొంగులేటి సన్నిహితులు చెబుతుండడంతో అది ఏ పార్టీ అనేది ఇంట్రస్టింగ్ గా మారింది. 

51 సభల్లో ఖమ్మంలో ఒకటి

కేంద్రంలో అధికారం చేపట్టి తొమ్మిదేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ‘బీజేపీ మహాజన్​సంపర్క్​ అభియాన్’  కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 51 భారీ బహిరంగ సభలు ప్లాన్​చేయగా, ఇందులో తెలంగాణలో రెండు సభలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఈనెల 15న ఖమ్మంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు జిల్లా నేతలు స్థల పరిశీలన చేస్తున్నారు. నగరంలోని పెవిలియన్​ గ్రౌండ్​ లేదా సర్ధార్​పటేల్​ స్టేడియంలో లక్ష మందితో పబ్లిక్​ మీటింగ్ ఏర్పాటుకు ప్లాన్​చేస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో గ్రౌండ్​ను ఫైనల్​చేస్తామని జిల్లా నేతలు చెబుతున్నారు.  

పీపుల్స్​మార్చ్​ ముగింపు సభ

రాష్ట్రవ్యాప్తంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న పాదయాత్ర ముగింపు సభను ఖమ్మంలో ప్లాన్​చేశారు. రాహుల్ గాంధీ నిర్వహించిన ‘హాత్ సే హాత్ జోడో’ యాత్రకు కొనసాగింపుగా ‘పీపుల్స్ మార్చ్’ పేరుతో​ఈ ఏడాది మార్చి16న భట్టి పాదయాత్ర ప్రారంభించారు. ఉమ్మడి ఆదిలాబాద్​లోని బోథ్​నియోజకవర్గంలో మొదలైన ఈ యాత్ర, ఏడు ఉమ్మడి జిల్లాల మీదుగా సాగి ఈనెల చివరి వారంలో ఖమ్మం జిల్లాకు చేరుకోనుంది. మొత్తం 40కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో 101 రోజుల పాటు 1065 కిలోమీటర్ల దూరం కవర్​ చేసిన యాత్ర ఈనెల 25న ఖమ్మం బహిరంగ సభతో ముగియనుంది. దీనికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్​అగ్రనేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. ముగింపు సభను ఎస్ఆర్ అండ్​ బీజీఎన్​ఆర్​కాలేజీ గ్రౌండ్​గానీ, లేదా ఇతర ప్రాంతంలో గానీ 2 లక్షల మందితో నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కాంగ్రెస్​ నేతలంటున్నారు. 

పొంగులేటి చేరికపై ఇంకా సస్పెన్సే ..  

మరోవైపు బీఆర్ఎస్​నుంచి బయటకు వచ్చిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి రాజకీయ భవిష్యత్​పై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి ఉన్న నేపథ్యంలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్​పార్టీల నుంచి ఆయనకు ఆహ్వానం ఉండగా, కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత మారిన పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి పొంగులేటి కాంగ్రెస్​లో చేరతారని ప్రచారం జరిగింది. అయితే ప్రాథమిక స్థాయిలో చర్చలు జరిగిన మాట వాస్తవమే అని, వచ్చే వారంలో ఏ పార్టీలో చేరబోయే దానిపై క్లారిటీ ఇస్తానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి అంటున్నారు.