ఎలక్షన్ ఫ్రాడ్ వల్లే ఓడిపోయా: మల్లికార్జున్ ఖర్గే

ఎలక్షన్ ఫ్రాడ్ వల్లే ఓడిపోయా: మల్లికార్జున్ ఖర్గే

బెంగళూరు: ఎన్నికల్లో మోసం వల్లే 2019 లోక్ సభ ఎన్నికల సందర్భంగా గుల్బర్గా నియోజకవర్గంలో తాను ఓడిపోయానని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆ ఒక్కసారి తప్ప ఎన్నడూ ఓడిపోలేదన్నారు. శుక్రవారం బెంగళూరులో ‘వోట్ అధికార్ ర్యాలీ’లో ఆయన మాట్లాడారు. ‘‘నా జీవితంలో ఒక్క 2019 లోక్ సభ ఎన్నికల్లో తప్ప.. 12కుపైగా ఎన్నికల్లో గెలిచాను. ఎలక్షన్ ఫ్రాడ్ కారణంగా నేను 2019లో తొలిసారి ఓటమిని చవిచూశాను. 

ఎలక్షన్ రిగ్గింగ్ కు బాధితుడిని అయ్యాను” అని ఖర్గే చెప్పారు. గుల్బర్గ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో 20 వేల ఓట్ల చొప్పున బోగస్ ఓట్లు చేర్చడం ద్వారా బీజేపీ తనను ఓడించిందన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీ డిపార్ట్ మెంట్ లను ప్రత్యర్థులను వేధించేందుకు, అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ వాడుకుంటోందని ఆయన ఆరోపించారు. గతంలో కర్నాటకలో మెజార్టీ లేకపోయినా ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించి, సంకీర్ణ సర్కారును బీజేపీ కూలదోసిందన్నారు. 

గోవా, మహారాష్ట్ర, మణిపూర్ రాష్ట్రాల్లోనూ ఇలాగే జరిగిందన్నారు. బీజేపీ ఎన్నడూ, ఏ ఎన్నికల్లోనూ గెలవలేదని, డబ్బుతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిందన్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లోనూ ‘మోదీ అండ్ కంపెనీ’కి చట్టబద్ధమైన విజయం దక్కలేదని ఖర్గే అన్నారు. వారు ఓట్ల దొంగతనంతో అధికారం పొందారని విమర్శించారు.