నీట్, రైలు ప్రమాదాలపై మాట్లాడండి.. 50 ఏండ్లయినా ఎమర్జెన్సీని వదలరా: ఖర్గే

నీట్, రైలు ప్రమాదాలపై మాట్లాడండి.. 50 ఏండ్లయినా ఎమర్జెన్సీని వదలరా: ఖర్గే
  • దేశంలో ఇంకెన్నో సమస్యలున్నయ్
  • ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తున్నరు
  • పదేండ్ల బీజేపీ పాలన అంతా అప్రకటిత ఎమర్జెన్సీ అని ఫైర్

న్యూఢిల్లీ: పదేండ్ల పాలనలో మోదీ ఎలాంటి విమర్శలు చేస్తూ వచ్చారో... మళ్లీ 18వ లోక్​సభ ప్రారంభం రోజు కూడా అవే చేశారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. నీట్, యూజీసీ నెట్, రైలు ప్రమాదాలు, మణిపూర్ అల్లర్లు, జమ్మూ కాశ్మీర్​లో టెర్రరిస్టుల కాల్పుల వంటి ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మోదీ పదేండ్ల పాలన అపక్రటిత ఎమర్జెన్సీని తలపించిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. 50 ఏండ్ల కింద విధించిన ఎమర్జెన్సీ గురించి ప్రధాని నిరంతరం ప్రస్తావిస్తూనే ఉంటారన్నారు. 

ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధిస్తున్నామని ప్రకటించిన తర్వాత ప్రభుత్వం దాన్ని అమలు చేసిందని తెలిపారు. కానీ, బీజేపీ పాలనలో ప్రధాని మోదీ ఎమర్జెన్సీని ప్రకటించకుండానే దానిని కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి ప్రకటనలతో ఇంకెన్ని రోజులు ప్రజలను మోసం చేస్తూ వస్తారని మండిపడ్డారు. ప్రజా తీర్పు ఎన్డీయేకు వ్యతిరేకంగా వచ్చిందన్న విషయాన్ని మోదీ గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ప్రధానిగా అవకాశం ఇచ్చినందుకు పాలనపై దృష్టి పెట్టాలన్నారు. రాజ్యాంగాన్ని రక్షించేందుకు ఎన్డీయే కూటమి నేతలు అటు పార్లమెంట్​లో.. ఇటు వీధుల్లో నినాదాలు చేస్తూనే ఉంటారని తెలిపారు. ప్రజల తరఫున సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. నీట్, ఇతర రిక్రూట్​మెంట్ ఎగ్జామ్స్ పేపర్ల లీక్ కారణంగా యువత పట్ల ప్రధాని కొంత సానుభూతి చూపుతారని 
ఆశిస్తున్నట్టు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని సూచించారు.

మోదీ కొత్తగా చెప్పిందేమీ లేదు: కాంగ్రెస్

వారణాసిలో మోదీ ఎలాంటి పరిస్థితుల్లో గెలిచారో దేశ ప్రజలందరికీ తెలుసని కాంగ్రెస్ జనరల్ 
సెక్రటరీ జైరాం రమేశ్ అన్నారు. నైతికంగా మోదీ ఓడిపోయినట్టే అని తెలిపారు. లోక్​సభ ఎన్నికల్లో వ్యక్తిగతంగా, రాజకీయంగా ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారని విమర్శించారు. పార్లమెంట్ బయట మోదీ మీడియాతో కొత్తగా చెప్పిందేమీ లేదని, ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమర్జెన్సీ విధించిన టైమ్​లో తానింకా పుట్టలేదని టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా అన్నారు. కానీ.. పదేండ్ల బీజేపీ అపక్రటిత ఎమర్జెన్సీని మాత్రం చూశానని విమర్శించారు. 

దేశప్రజలు బీజేపీని వద్దనుకున్నారని, అందుకే మ్యాజిక్ ఫిగర్ కూడా దాటలేకపోయిందన్నారు. ఎమర్జెన్సీ విధించి 50 ఏండ్లు దాటిపోయిందని, ప్రస్తుత సమస్యలపై ప్రధాని దృష్టి పెట్టాలని శివసేన (యూబీటీ) నేత అని దేశాయ్ అన్నారు. 1975లో విధించిన ఎమర్జెన్సీ గురించి ఇప్పుడు మాట్లాడటం సరికాదని ఆర్​ఎస్పీ నేత ఎన్​కే ప్రేమ్​చంద్రన్ అన్నారు. దేశంలో ఇప్పుడు నెలకొన్న పరిస్థితులపై చర్చించుకుందామని సూచించారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా మోదీ వ్యవహరిస్తే బాగుంటుందని ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) ఎంపీ చంద్రశేఖర్ అన్నారు. దేశానికి రాజ్యాంగమే పునాది అని తెలిపారు.