
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చెప్పారు. అందులో ‘మహాలక్ష్మి’ పథకం ఫస్ట్ ప్లేసులో ఉంటుందని అన్నారు. ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆధ్వర్యంలోని మేనిఫెస్టో కమిటీ రూపొందించిన కాంగ్రెస్ ‘అభయ హస్తం’ మేనిఫెస్టోను శుక్రవారం గాంధీ భవన్‌లో ఖర్గే విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల బాగు కోసం, ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ఈ మేనిఫెస్టో ఉపయోగపడుతుందని చెప్పారు.
మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ చేసిన అవినీతి బయటపడిందని, దీంతో ఆయన గొంతులో ఆందోళన కనిపిస్తోందని ఖర్గే అన్నారు. మోదీ, కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ‘‘ఎప్పుడూ ఫామ్‌హౌస్‌లోనే ఉండే కేసీఆర్ ఇకపై అక్కడే ఉండిపోతరు. కేసీఆర్‌కు టాటా బైబై చెప్పాలని ప్రజలు డిసైడ్ అయ్యారు.
జనాలు బాగు పడుతారని తెలంగాణ ఇస్తే.. కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడింది. ప్రాజెక్టులు, పథకాలు.. ఇలా ప్రతి దాంట్లోనూ అవినీతికి పాల్పడుతున్నారు’’ అని ఆరోపించారు. కర్నాటకలో చెప్పిన ప్రతి హామీనీ నెరవేరుస్తున్నామని, అధికారంలోకి రాగానే ఇక్కడ ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పారు. తొలి కేబినెట్ సమావేశంలోనే వాటిపై నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించారు.
అసైన్డ్ భూములను తిరిగి ప్రజలకు ఇప్పిస్తం: భట్టి
ప్రజా ప్రభుత్వాన్ని నెలకొల్పడానికి ఈ మేనిఫెస్టో ఉపయోగపడుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఉద్యమ ఆకాంక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా సాకారం చేస్తుందని చెప్పారు. అధికారంలోకి వచ్చాక బీసీ సబ్ ప్లాన్, కుల గణన, రైతులకు రుణమాఫీ, కౌలు రైతులకు ప్రోత్సాహం సహా అన్ని హామీలనూ నెరవేరుస్తామన్నారు. బీఆర్‌ఎస్ గుంజుకున్న అసైన్డ్ భూములను, తిరిగి ప్రజలకు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. అభయ హస్తం మేనిఫెస్టోను ఇంటింటికీ తీసుకువెళ్లి ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ శ్రేణులను కోరారు.
ఇదే మా భగవద్గీత.. బైబిల్.. ఖురాన్: రేవంత్
తెలంగాణ కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల మేనిఫెస్టోనే భగవద్గీత, ఖురాన్, బైబిల్‌తో సమానమని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందులోని ప్రతి హామీని నెరవేరుస్తామని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తామన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలన్నీ నెరవేరుస్తామని తెలిపారు. పదేండ్లలో రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాలు చేశాడని ఆరోపించారు. అందుకే ప్రజలు కేసీఆర్‌కు ఓటుతో గుణపాఠం చెప్పాలని డిసైడ్ అయ్యారన్నారు.