
- డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌కు ఖర్గే లేఖ
న్యూఢిల్లీ: బిహార్‌లో ఎన్నికల జాబితాల సవరణ కోసం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పై చర్చ జరపాలని డిమాండ్‌చేస్తూ.. కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్‌కు బుధవారం లేఖ రాశారు.
ఆ లేఖలో గతంలో రాజ్యసభ చైర్మన్ ఇచ్చిన తీర్మానాలను ఉటంకిస్తూ.. ఈ అంశం దేశంలోని కోట్లాదిమంది ఓటర్లకు, ముఖ్యంగా బలహీన వర్గాలకు చెందిన వారికి అత్యంత కీలకమైనదని పేర్కొన్నారు.
2023 జులై 21న అప్పటి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కడ్ ఇచ్చిన తీర్మానాన్ని ఉటంకించారు. ఆ తీర్మానంలో రాజ్యసభ పరిమితితో ప్రపంచంలోని ఏ అంశాన్నైనా చర్చించే అధికారం కలిగి ఉందని పేర్కొన్నారు.
ఈ తీర్మానం ఆధారంగా, ఎన్నికల జాబితా సవరణ వంటి ప్రజాస్వామ్యానికి కీలకమైన అంశాన్ని చర్చించే హక్కు రాజ్యసభకు ఉందని ఖర్గే పేర్కొన్నారు. సర్ ప్రక్రియలో ఓటరు జాబితాలో అక్రమాలు, ఓట్ల చోరీ జరుగుతోందని ఖర్గే ఆరోపించారు.