
ఆదిలాబాద్, వెలుగు : కల్లు డిపో తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని ఖోడద్ గ్రామస్తులు సోమవారం ఆందోళనకు దిగారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ కలెక్టరేట్‌కు చేరుకొని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమ గ్రామంలో ఏర్పాటు చేసిన కల్లు డిపోను తొలగించాలని డిమాండ్ చేశారు.
గ్రామంలో ఈత, తాటి చెట్లు లేకున్నా మత్తు పదార్థాలు, రసాయనాలు కలిపి కల్లు తయారు చేసి అమ్ముతున్నారని ఆరోపించారు. కల్లు దుకాణం రోడ్డు పక్కనే ఉండడంతో దానిని తాగిన వారు ఇష్టారీతిన వాహనాలు నడుపుతున్నారని, దీని వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫీసర్లు స్పందించి కల్లు డిపోను తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ రాజర్షి షాకు వినతిపత్రం అందజేశారు.