
హైదరాబాద్: గతంలో కిడ్నీ స్టోన్స్ సమస్య పెద్దవారిలోనే ఎక్కువగా కనిపించేది. కానీ, ఇప్పుడు పిల్లలు, యువతలోనూ ఈ సమస్య విస్తరిస్తోంది. జంక్ ఫుడ్, షుగర్ డ్రింక్స్, సమయానికి నీళ్లు తాగకపోవడం, శారీరక శ్రమ తక్కువగా ఉండటం వంటివి పిల్లల్లో ఈ సమస్యకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా 10 నుంచి -17 ఏండ్ల పిల్లల్లో కూడా కిడ్నీ స్టోన్స్ సమస్యలు కనిపిస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. పదేండ్ల క్రితం వరకు కిడ్నీ స్టోన్స్ సమస్య చాలా అరుదుగా ఉండేదని, మారిన జీవన విధానం వల్ల ఇటీవలి కాలంలో కేసుల సంఖ్య పెరుగుతున్నదని డాక్టర్లు పేర్కొంటున్నారు.
సరిపడా నీళ్లు తాగకపోతే కిడ్నీలకు ముప్పే..
మారిన జీవనశైలీలో కిడ్నీ సంబంధిత సమస్యలు తీవ్రం అవుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. అధిక ఉప్పు వినియోగం, జంక్ ఫుడ్, షుగర్ డ్రింక్స్ అధికంగా తీసుకోవడం, వంశపారంపర్య కారణాలు, వృత్తిపరమైన ఒత్తిడి కిడ్నీల సమస్యకు దారి తీస్తాయని పేర్కొంటున్నారు. రోజుకు 2.5 నుంచి 3 లీటర్ల నీరు తాగాలని, మూత్రం లేత పసుపు రంగులో లేదా నీటిలా స్పష్టంగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. అధిక ఉప్పు, ప్రాసెస్డ్ ఫుడ్, మీట్, షుగర్ డ్రింక్స్ మానేయాలని, పండ్లు (వాటర్‌మెలన్, కొబ్బరి నీళ్లు), కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు.
ఆక్సలేట్ ఎక్కువగా ఉండే ఆహారాలు (బీట్‌రూట్, పాలకూర, టమాటో) తక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. కిడ్నీ స్టోన్స్ ఉన్నట్లు అనుమానం ఉంటే రెగ్యులర్ చెకప్‌లు చేయించుకోవాలని సూచిస్తున్నారు. చిన్న రాళ్లు (5 మి.మీ. కంటే తక్కువ) సాధారణంగా మూత్రం ద్వారా వెళ్లిపోతాయని, పెద్ద రాళ్లకు ట్రీట్మెంట్అవసరని పేర్కొంటున్నారు.
నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలు ఫెయిల్ అయ్యే ప్రమాదం: డాక్టర్ రవిచందర్, యూరాలజీ హెచ్వో డీ, గాంధీ ఆస్పత్రి
చాలామంది కిడ్నీలలో రాళ్లను నిర్లక్ష్యం చేస్తారు. సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే రాళ్లు కిడ్నీలను దెబ్బతీస్తాయి. కిడ్నీలు ఫెయిల్ అయ్యే పరిస్థితులు కూడా ఏర్పడొచ్చు. కిడ్నీలో రాళ్లను తీసివేయడం అంటే కిడ్నీలను కాపాడుకోవడమే. గాంధీలో నెలకు 60 నుంచి 70 కిడ్నీ స్టోన్ రిమూవల్ సర్జరీలు చేస్తున్నాం. అందరికీ సర్జరీ అవసరం ఉండకపోవచ్చు. కొంతమందిలో మందులతో కూడా రాళ్లను కరిగించే అవకాశం ఉంటుంది. కిడ్నీలో రాళ్లు ఉన్నట్టు లక్షణాలు కనిపిస్తే వెంటనే క్వాలిఫైడ్ డాక్టర్ కు చూయించుకోవాలి.