కిలాడీ: ప్రేమ..పెళ్లి పేరుతో యువకులకు టోపీ

కిలాడీ: ప్రేమ..పెళ్లి పేరుతో యువకులకు టోపీ
  • మూడో పెళ్లి తర్వాత బయటపడ్డ కిలాడీ భాగోతం
  • మూడో పెళ్లి కొడుకు దగ్గర 6 లక్షలు నొక్కేసి పరారీ
  • కిలాడీ లేడి సుహాసిని కోసం గాలిస్తున్న పోలీసులు

చిత్తూరు: ప్రేమిస్తున్నట్లు నటించి.. ఆ తర్వాత పెళ్లి చేసుకుని.. పెళ్లి కొడుకు దగ్గర డబ్బు.. దస్కం.. విలువైన వస్తువులు తీసుకుని ఉడాయిస్తున్న కిలాడీ ఉదంతం వెలుగులోకి వచ్చింది. అనాధను కాబట్టి నాకెవరూ లేరంటూ ఇద్దర్ని పెళ్లి చేసుకుని మోసం చేస్తున్న కిలాడీ.. మూడో పెళ్లి తర్వాత నాటకీయ ఫక్కీలో దొరికిపోయింది. ఆమె  ఆధార్ కార్డుతో ఆమె అసలు స్వరూపం బయటపడింది. ఆమె గురించి తెలుసుకుని భర్త అవాక్కయ్యాడు. తనకంటే ముందు ఇద్దర్ని పెళ్లి చేసుకుని మోసం చేసినట్లు ఆమె అసలు స్వరూపం తెలుసుకుని అలిపిరి పోలీసులను ఫిర్యాదు చేశాడు భర్త.  కిలాడీ లేడి ఉదంతం సంచలనం సృష్టించింది. 
తిరుపతి సమీపంలోని విజయపురానికి చెందిన ఓ యువకుడు స్థానికంగా ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఇటీవల అదే కంపెనీలో సుహాసిని అనే యువతి ఉద్యోగంలో చేరింది. తనది నెల్లూరు.. ఓ అనాథ అని సదరు యువకుడితో పరిచయం పెంచుకుంది. అలా అతడిని ప్రేమిస్తున్నానని, పెళ్లి కూడా చేసుకుంటానని మాయమాటలతో బురిడీ కొట్టించింది. అవేమీ తెలియని యువకుడు తోటి ఉద్యోగి, అనాథ అనే జాలితో ఆమె మాటలు నమ్మి పెళ్లికి ఓకే చెప్పేశాడు. కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు.
అయితే సుహాసిని వివిధ ఖర్చుల పేరిట భర్త.. ఆమె అత్తమామల వద్ద నుంచి రూ.6 లక్షల తీసుకుంది. తనను పెంచిన తండ్రికి ఆరోగ్యం బాగాలేదని మూడు రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అయితే ఆమె ఆధార్ కార్డును అత్తగారి ఇంట్లోనే వదిలేసి వెళ్లడంతో దానిని పరిశీలించిన భర్తకు షాకింగ్ విషయాలు తెలిశాయి. సుహాసిని అప్పటికే ఇద్దరు వ్యక్తులను పెళ్లి చేసుకుందని, మొదటి భర్తతో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిందని తేలింది.
సుహాసిని వ్యవహారంపై కూపీ లాగిన భర్తకు మరికొన్ని విషయాలు తెలిశాయి. ప్రేమ, పెళ్లి పేరుతో ఇలాగే మోసం చేసి డబ్బులు తీసుకుని పరారీ అవుతోందని తెలిసింది. దీనిపై సుహాసినికి ఫోన్ చేసి నిలదీయగా.. మూడో భర్తకు షాక్ ఇచ్చింది. తన గురించి ఎక్కడైన చెప్పినా.. పోలీసులకు ఫిర్యాదు చేసినా రివర్స్ కేసు పెడతానని బెదిరింది. దీంతో ఖంగుతిన్న భర్త.. తిరుపతి అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. యువకుడి ఆరోపణలు అన్నీ నిజమేనని తేల్చారు. ప్రస్తుతం సుహాసిని హైదరాబాద్‌లో మకాం వేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆమెను పట్టుకుని తీసుకు వచ్చేందుకు ఓ బృందం హైదరాబాద్ కు వెళ్లినట్లు సమాచారం.