అమిత్ షాతో కిరణ్​కుమార్ రెడ్డి భేటీ.. కర్నాటక ఎన్నికలపై చర్చ

అమిత్ షాతో కిరణ్​కుమార్ రెడ్డి భేటీ.. కర్నాటక ఎన్నికలపై చర్చ

న్యూఢిల్లీ, వెలుగు: ఇటీవలే బీజేపీలో చేరిన ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి,  కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. కర్నాటక ఎన్నికలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా,  పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ(సంస్థాగత) బీ ఎల్ సంతోష్, కర్నాటక మాజీ సీఎం యడ్యూరప్పతో అమిత్​షా శనివారం ఢిల్లీలో నిర్వహించిన సమీక్ష సమావేశంలోనూ కిరణ్​ కుమార్​ రెడ్డి పాల్గొన్నారు. ఆ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, అనుసరించాల్సిన ఎన్నికల వ్యూహాలు,  గెలుపే లక్ష్యంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఈసందర్భంగా చర్చించారు. 

కర్నాటకలో తెలుగు ఓటర్లను ప్రభావితం చేసేందుకు కిరణ్ కుమార్ రెడ్డి సేవల్ని వినియోగించుకోవాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయనకు కర్నాటక ఎన్నికల్లో కీలక బాధ్యతలు అప్పగించే చాన్స్ ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, శనివారం సాయంత్రం కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, కిషన్ రెడ్డి, ఇతర ముఖ్యనేతలతోనూ కిరణ్​కుమార్​ రెడ్డి భేటీ అయ్యారు.