దేశంలో అసలైన ఫాసిస్ట్ పార్టీ కాంగ్రెస్సే! : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

దేశంలో అసలైన ఫాసిస్ట్ పార్టీ కాంగ్రెస్సే! : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  •     కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణ
  •     ‘భారత్ సమిట్’ కాదు.. దేశ వ్యతిరేక సమిట్
  •     సదస్సు ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ 

హైదరాబాద్, వెలుగు: దేశ చరిత్రలో అసలైన ఫాసిస్ట్, నియంతృత్వ పార్టీ కాంగ్రెస్సేనని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ వేదికగా జరుగుతున్నది ‘భారత్ సమిట్’ కాదు.. దేశ వ్యతిరేక సమ్మిట్ అని అభివర్ణించారు. ఈ సదస్సు ద్వారా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, దీని వల్ల తెలంగాణకు ఒరిగిందేమీ లేదన్నారు. సదస్సు ఖర్చులు, లాభాలపై సీఎం రేవంత్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

ఇందిరాగాంధీ హయాంలోని ఎమర్జెన్సీ కాలంలో పత్రికా స్వేచ్ఛను కాలరాసి, ప్రజల ప్రాథమిక హక్కులను అణచివేసి లక్షలాది మందిని జైళ్లలో బంధించిన చరిత్ర కాంగ్రెస్​దేనని ఆరోపించారు. ఒకవైపు రాహుల్ గాంధీ విదేశీ వేదికలపై నిలబడి ‘‘భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది, ఎన్నికలు ఫ్రాడ్, దేశం ఫాసిస్టుల చేతిలో ఉంది’’ అని ఉపన్యాసాలు ఇస్తుంటే.. మరోవైపు ఫాసిస్టుల పాలనలో ఉన్న దేశానికి విదేశీ పెట్టుబడులు ఎలా వస్తాయో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఇస్తున్న ప్రకటనలకు, రాహుల్ గాంధీ ప్రసంగాలకు పొంతన లేదని ఎద్దేవా చేశారు. 

ప్రపంచం ముందు దేశం పరువు తీశారు..

ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసి విదేశీయులకు ఫస్ట్ క్లాస్ విమాన టికెట్లు ఇచ్చి, స్టార్ హోటళ్లలో బస ఏర్పాటు చేసి సదస్సు నిర్వహించారని కిషన్ రెడ్డి విమర్శించారు. భారతదేశం, ప్రధాని మోదీ మీద విషం చిమ్మే విదేశీ శక్తులను, జేఎన్‌‌‌‌యూలో ‘తుక్డే తుక్డే’ గ్యాంగ్‌‌‌‌లకు మద్దతు ఇచ్చే వారిని హైదరాబాద్‌‌‌‌కు పిలిపించి ప్రపంచం ముందు దేశం పరువు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు వీసా నిరాకరించేలా అమెరికాపై ఒత్తిడి తెచ్చిన కాంగ్రెస్ నేతలు.. నేడు వైట్ హౌస్‌‌‌‌లో ప్రొటోకాల్ పక్కనపెట్టి మోదీకి రెడ్ కార్పెట్ స్వాగతం పలకడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని తెలిపారు.