వడ్లకు బోనస్ ఏమైంది?..రైతు భరోసా ఎటుపోయింది?: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

వడ్లకు బోనస్ ఏమైంది?..రైతు భరోసా ఎటుపోయింది?: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

 

  • హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్ 
  • రేవంత్ మాటలు కొండలు దాటుతున్నయ్.. పనులు గేటు దాటుతలేవ్
  • నేను పార్టీలు మారి వచ్చినోడ్ని కాదు 
  • రేవంత్​కూ కేసీఆర్ గతే పడతదంటూ కామెంట్   

న్యూఢిల్లీ/హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి మాటలు కొండలు దాటుతున్నాయని, కానీ ఆయన పనులు మాత్రం సెక్రటేరియట్ గేటు కూడా దాటడం లేదని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో సీఎం రేవంత్ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. వడ్లకు క్వింటాల్‌‌‌‌‌‌‌‌కు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు కేవలం సన్న వడ్లకే ఇస్తామని మాట మార్చారని విమర్శించారు.

తీరా చూస్తే సన్న వడ్లకు లేదు, దొడ్డు వడ్లకు లేదు.. రైతులకు ఎక్కడా బోనస్ అందడం లేదన్నారు. రైతులకు రూ.15 వేలు, కూలీలకు రూ.12 వేల ఆర్థిక సాయం ఏమైందని ప్రశ్నించారు. రైతులను నడిరోడ్డుపై వదిలేసిన కాంగ్రెస్ సర్కార్.. కేంద్రం ఇచ్చే నిధులతోనే రోజువారీ పాలన సాగిస్తోందన్నారు. తనపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘నేను పన్నెండు పార్టీలు తిరిగి వచ్చిన వ్యక్తిని కాదు.

బీజేపీలోనే రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాను. బీజేపీలోనే ఉన్నాను. నా సేవలకు రేవంత్ సర్టిఫికెట్ అవసరం లేదు. ప్రజల తీర్పే మాకు సర్టిఫికెట్’ అని స్పష్టం చేశారు. వ్యక్తిగత దూషణలకు దిగడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హెచ్చరించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకే తాను ముక్కలని, ఆ రెండు పార్టీలకు తిట్టుకోవడం తప్ప అభివృద్ధి చేయడం చేతకాదని విమర్శించారు.

రేవంత్‌‌కూ కేసీఆర్ గతే.. 

తెలంగాణలో అధికారం మారినా, ప్రజల ఆకాంక్షలు మాత్రం నెరవేరడం లేదని కిషన్ రెడ్డి అన్నారు. ‘ఎక్స్’ వేదికగానూ రేవంత్ సర్కార్ పై ఆయన విమర్శలు గుప్పించారు. ‘‘అడ్డగోలుగా అబద్ధపు హామీలు, చేతగాని అసమర్థ పాలన, అడుగడుగునా నమ్మకద్రోహం నడుమ.. క్షేత్రస్థాయి సమస్యలను గాలికి వదిలి గాల్లో మేడలు కడుతూ.. విదేశాలపై వ్యామోహం చూపిస్తూ.. సొంత దేశంలో జరుగుతున్న అభివృద్ధిపై కారుకూతలు కూసిన ముఖ్యమంత్రుల  గ్రాఫ్‌‌‌‌‌‌‌‌ పాతాళానికి పడిపోయింది” అని పేర్కొన్నారు.

విదేశీ వ్యామోహంలో మాట్లాడి, ప్రజాగ్రహాన్ని చవిచూసిన కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను ప్రజలు ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్ కు పరిమితం చేశారన్నారు. ఇప్పుడు ఆ సీట్లో కూర్చున్న రేవంత్ రెడ్డి కూడా అదే తీరున మాట్లాడుతూ తీవ్ర ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డికి కూడా.. కేసీఆర్ కు పట్టిన గతే తప్పదన్నారు.

21న యోగా డే వేడుకలు..  

జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 210 దేశాల్లో వేడుకలు జరుగనున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. ఈసారి ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్‌‌‌‌‌‌‌‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని లాల్‌‌‌‌‌‌‌‌బహదూర్ స్టేడియంలో జూన్ 20న 24 గంటల కౌంట్‌‌‌‌‌‌‌‌డౌన్, జూన్ 21న ఉదయం 7 గంటలకు ప్రధాన యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ వేడుకల్లో యువత, విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.