- వాళ్లపై లాఠీచార్జ్ సరికాదు: కిషన్ రెడ్డి
- జీవో 29పై అనుమానాలున్నయ్
- గ్రూప్ 1 అభ్యర్థులతో చర్చించాలని సర్కార్కు సూచన
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వానికి ఉద్యోగాలు భర్తీ చేయాలనే చిత్తశుద్ధి ఉంటే.. నిరుద్యోగులతో మాట్లాడి, వారి బాధను అర్థం చేసుకుంటే వచ్చే నష్టమేమిటని కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు నిరుద్యోగుల దగ్గరికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ.. ఇప్పుడు ఎందుకు వెళ్లడం లేదో చెప్పాలన్నారు. నిరుద్యోగుల దగ్గరికి వెళ్లడానికి ధైర్యం లేకపోతే పోలీసులను వెంట తీసుకెళ్లి, వారితో చర్చించాలని సూచించారు. ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు. ‘‘రేవంత్ రెడ్డి సీఎం కాకముందు అశోక్ నగర్లైబ్రరీకి వెళ్లి నిరుద్యోగులతో కబుర్లు చెప్పారు. కానీ ఇప్పుడేమో లాఠీచార్జీకి దిగుతారా?. వారంతా మన పిల్లలే.. వారితో ఒకసారి చర్చిస్తే పోయేదేముంది? వారి బాధను కూడా అర్థం చేసుకోవాలి” అని ప్రభుత్వానికి కిషన్ రెడ్డి సూచించారు.
సీఎం తీరు చూస్తే బీఆర్ఎస్ విధానాన్నే కాంగ్రెస్ అవలంబిస్తున్నట్టుగా ఉందని విమర్శించారు. ‘‘జీవో 29 విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయి. మెయిన్స్ పరీక్షలను హైదరాబాద్లోనే ఎందుకు నిర్వహిస్తున్నారని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. వీటన్నింటిపై గ్రూప్ 1 అభ్యర్థులతో ప్రభుత్వం చర్చించాలి” అని సూచించారు. నిరుద్యోగులు ఆందోళనలు చేస్తే ప్రభుత్వం అణచివేస్తున్నదని మండిపడ్డారు. ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు లాఠీచార్జీలు, అక్రమ జీవోలు, అక్రమంగా ఇండ్ల కూల్చివేతలు చేపడుతూ కాలం వెళ్లదీసే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు.
సీఎం.. హిందూ వ్యతిరేకి
హిందూ సంఘాలపై పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి హిందూ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్నారని ఆరోపించారు. వినాయక చవితి, బోనాలు, దేవీ నవరాత్రుల సందర్భంగా అనేక మందిపై కేసులు పెట్టించారని మండిపడ్డారు. ఇతర మతస్తులకు సంబంధించిన ప్రార్థనా కేంద్రాల్లో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వస్తున్న శబ్దాలు పోలీసులకు, ముఖ్యమంత్రికి వినపించవా? కనిపించవా? అని ప్రశ్నించారు. సిటీలో మోటివేషన్ క్లాసుల పేరుతో అంతమంది గుడి పక్కనే హిందూ వ్యతిరేక విధానాలకు పాల్పడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.