తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటోంది : కిషన్ రెడ్డి

తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటోంది : కిషన్ రెడ్డి

బీజేపీ చేపట్టే ఏ పోరాటమైనా పాలమూరు నుంచే ప్రారంభించడం ఆనవాయితీ అన్నారు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. పాలమూరు నుంచే డబుల్ బెడ్రూమ్ సమస్యలపై నిరసన ర్యాలీ చేపట్టామన్నారు. ప్రజల సొమ్ముతో ముఖ్యమంత్రి కేసీఆర్ 10 ఎకరాల్లో ఇల్లు కట్టుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కు కావడంతోనే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు భూములు ఇస్తున్నారని, పాలమూరులో మాత్రం నిరుపేదలకు ఇండ్లు కట్టించడం లేదన్నారు. అర్హులైన నిరుపేదలకు తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. మహబూబ్ నగర్ లో బీజేపీ పార్టీ నిరసన ర్యాలీకి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో పాటు రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రదీప్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, తల్లొజు ఆచారి, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహబూబ్ నగర్ ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నుంచి గడియారం చౌరస్తా వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. 

ఇచ్చిన హామీలను తొమ్మిదేళ్ల నుంచి కేసీఆర్ విస్మరిస్తూ వస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చిన రేషన్ కార్డులే ఇప్పటికీ ఉన్నాయని, కేసీఆర్ సర్కారు మాత్రం కొత్తగా అర్హులకు రేషన్ కార్డులు ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటోందని ఆరోపించారు. దళితులకు వెన్నుపోటు పొడిచి సీఎం పీఠంపై కూర్చున్న ఘనత కేసీఆర్ దే అన్నారు. తొమ్మిదేళ్లలో ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదని మండిపడ్డారు. 30 లక్షల మంది నిరుద్యోగ యువతీ, యువకులు ఆకలిమంటల్లో ఉన్నారని వ్యాఖ్యానించారు. పేపర్ లీకేజీ కారణంగా నిరుద్యోగులు తీవ్ర ఆవేదనలో ఉన్నారన్నారు. 

ప్రజలను మోసం చేసిన చరిత్ర కేసీఆర్ దే అన్నారు కిషన్ రెడ్డి. రైతురుణ మాఫీ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ దేవుడెరుగు..కేసీఆర్ కుటుంబం బంగారమైందన్నారు. తెలంగాణలో అభివృద్ది కుంటుపడిందన్నారు. ప్రజలను మోసం చేయటం కోసమే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టారని ఆరోపించారు. రాష్ట్రాన్ని లిక్కర్ తెలంగాణ, అప్పుల తెలంగాణగా కేసీఆర్ మార్చారని ఆరోపించారు. తెలంగాణలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రశ్నిస్తే ప్రతిపక్షాల మీద కేసులు పెడుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కుటుంబ పార్టీలే అని, వాటి డీఎన్ఏ కూడా ఒక్కటే అని వ్యాఖ్యానించారు. ఈ మూడు పార్టీలు ఉమ్మడి పౌరస్మృతిని వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు.