ఇవాళ బాటసింగారానికి కిషన్ రెడ్డి

ఇవాళ బాటసింగారానికి కిషన్ రెడ్డి

డబుల్ బెడ్రూం​ ఇండ్ల పరిశీలన
భారీ కాన్వాయ్​తో వెళ్లనున్న బీజేపీ శ్రేణులు


హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గురువారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బాటసింగారం గ్రామానికి వెళ్లనున్నారు. అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలనే డిమాండ్​తో బీజేపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు సిద్ధమైంది. అందులో గురువారం ‘చలో బాటసింగారం’ ప్రోగ్రామ్​ను నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమంలో ఆ గ్రామంలోని డబుల్ బెడ్రూం ఇండ్లను కిషన్ రెడ్డి పరిశీలించనున్నారు. ఆయన వెంట పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ కాన్వాయ్​తో హైదరాబాద్ నుంచి బాట సింగారానికి తరలివెళ్లనున్నారు. కిషన్ రెడ్డి బీజేపీ స్టేట్ చీఫ్ గా నియమితులైన తర్వాత పార్టీ పరంగా ఇది మొదటి కార్యక్రమం కావడంతో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు రంగారెడ్డి జిల్లా నేతలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ కార్యకర్తలు, నాయ కులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. 


రేపు పార్టీ‌‌‌‌‌‌‌‌ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్​రెడ్డి శుక్రవారం బాధ్య తలు స్వీకరించనున్నారు. ఉదయం 7.30 గంటలకు చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి టెంపుల్​లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 9.30 గంటలకు గన్ పార్క్​ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి.. అక్కడి నుంచి భారీ ర్యాలీగా నాంపల్లిలోని పార్టీ స్టేట్​ఆఫీసుకు  చేరుకుంటారు. 11.15 నుంచి 12 గంటల లోపు ఆయన బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారు. అనంతరం పార్టీ కార్యాలయం ముందు కిషన్ రెడ్డికి అభినందన సభ జరుగుతుంది. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర కోర్ కమిటీ మీటింగ్​జరుగుతుంది. దీనికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ సునీల్ బన్సల్ చీఫ్ గెస్టుగా హాజరుకానున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం కోర్ కమిటీ మీటింగ్ ఈ నెల 22న జరగాల్సి ఉంది. కానీ తాజా షెడ్యూల్ ప్రకారం 21న సాయంత్రం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 22న పార్టీకి చెందిన మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ జడ్పీ చైర్మన్ లు, మాజీ మేయర్లతో పార్టీ స్టేట్ ఆఫీసులో కిషన్ రెడ్డి బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు.