రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరాలి..బీఆర్ఎస్, కాంగ్రెస్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నయ్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 

రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరాలి..బీఆర్ఎస్, కాంగ్రెస్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నయ్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరున్నా, పార్టీ కార్యకర్తలే బీజేపీకి వెన్నెముక అని చెప్పారు. పార్టీ గ్రామ స్థాయి సభ్యత్వం నుంచి జాతీయ అధ్యక్షుడి ఎన్నిక వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో చేపట్టే పార్టీ కేవలం బీజేపీ మాత్రమేనని అన్నారు. గత 11 ఏండ్లలో మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై చర్చించడానికి తాము సిద్ధమని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులకు సవాల్ విసిరారు.

రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక వేడుకలో మంగళవారం కిషన్​రెడ్డి మాట్లాడారు. పదవి ఉన్నా, లేకున్నా నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేసిన నేత రాంచందర్ రావు అని కొనియాడారు. కేసీఆర్ ఫ్యామిలీ పదేండ్లు రాష్ట్రాన్ని దోచుకున్నదని, ఇప్పుడు రాహుల్ గాంధీ ఫ్యామిలీ, సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడి 11 ఏండ్లయినా ఉద్యమ కాంక్షలు నెరవేరలేదన్నారు.

రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందని కొందరు ప్రశ్నిస్తున్నారని, బీజేపీ గత 11 ఏండ్లలో రాష్ట్ర అభివృద్ధి కోసం సుమారు రూ.12 లక్షల కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్, ఎంపీలు డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్, నగేశ్, మాజీ కేంద్ర మంత్రి విద్యాసాగర్ రావు, మాజీ ఎంపీలు బూర నర్సయ్య గౌడ్, బీబీ పాటిల్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కాసం వెంకటేశ్వర్లు, ప్రేమేందర్ రెడ్డి పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత

రామచంద్రాపురం/పటాన్​చెరు, వెలుగు: పాశమైలారంలో ప్రమాదానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని కిషన్​ రెడ్డి అన్నారు. ప్రమాద స్థలాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావుతో కలిసి ఆయన పరిశీలించారు. సిగాచీ ప్రమాదానికి పొల్యూషన్​ బోర్డు, పరిశ్రమల శాఖ ఆఫీసర్ల నిర్లక్ష్యమే కారణమన్నారు.