మునక్కాయ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరు. చారు, కూర ఏదైనా మునక్కాయ. ముక్కలను లొట్టలేసుకుంటూ తినేస్తారు. అంతేకాకుండా దాంట్లో బోలెడన్ని పోషకాలు ఉంటాయి. అలానే మునగాకులో కూడా చాలా పోషకాలు ఉంటాయట. మునగాకు తినడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందని కూడా అంటుంటారు. 'అబ్బో మునగాకు కూరా!" అని పెదవి విరవకుండా ఉండాలంటే ఇలా వెరైటీగా మునగాకుతో పరోట, పకోడి వేస్తే ఎవరైనా లాగించేస్తారు. అని ఎలా చేయాలో చూసేద్దామా!
మునగ పరాట తయారీకి కావాల్సినవి
- మునగాకు: ఒక కప్పు
- గోధుమపిండి: ఒకటిన్నర కప్పు
- శనగపిండి: అరకప్పు
- వాము: అర టీ స్పూన్
- పసుపు: పావు టీ స్పూన్
- కారం: పావు టీ స్పూన్
- ఉప్పు: అర టీ స్పూన్
- జీలకర్ర పొడి: పావు టీ స్పూన్
- నూనె: మూడు టేబుల్ స్పూన్లు
- పాలు: పావుకప్పు
- నీళ్లు: తగినన్ని
మునగ పరాట తయారీ విధానం
లేత మునగాకును బాగా కడిగి సన్నగా తరగాలి. తరువాత వెడల్పాటి గిన్నెలో గోధుమపిండి, శనగపిండి, వాము, పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, నూనె వేయాలి.
మునగాకు, పాలు పోసి, నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా ముద్దగా కలిపి, కొద్దిగా నూనెవేసి 10 నిమిషాలు పక్కనపెట్టాలి.
తరువాత ముద్దలుగా చేసుకుని పొడి పిండిని అద్దుకుంటూ పరాటాల్లా చేయాలి. పోయి మీద పెనం వేడిచేసి నూనె వేస్తూ రెండు వైపులా కాలిస్తే మునగాకు పరాటా రెడీ.
మునగ పకోడి తయారీకి కావాల్సినవి:
- మునగాకు: ఒక కప్పు
- శనగపిండి: ఒక కప్పు
- బియ్యప్పిండి: పావు కప్పు
- సోంపు: కొద్దిగా
- జీలకర్ర: పావు టేబుల్ స్పూన్
- కారం: అర టేబుల్ స్పూన్
- పసుపు: పావు టేబుల్ స్పూన్
- పచ్చిమిర్చి తరుగు: కొద్దిగా
- అల్లం వెల్లుల్లి పేస్ట్: అర టేబుల్ స్పూన్
- కొత్తిమీర: కొద్దిగా
- నీళ్లు: కొన్ని
- నూనె: వేగించడానికి సరిపడా
- ఉల్లిగడ్డ ముక్కలు: ఒక కప్పు (పొడుగ్గా తరిగినవి)
మునగ పకోడి తయారీ విధానం
ఒక గిన్నెలో మునగాకు, శనగపిండి, సోంపు, జీలకర్ర, కారం, పసుపు, పచ్చిమిర్చి తరుగు, అల్లం వెల్లులి పేస్ట్, కొత్తిమీర వేసి కలపాలి.
రెండు టేబుల్ స్పూన్ల నూనె, ఉప్పు, కొద్దిగా నీళ్లు చిలకరించి పకోడీ పిండిలాకలపాలి. కళాయిలో వేగించడానికి సరిపడా నూనె పోసి వేడి చేయాలి.
నూనె బాగా కాగిన తర్వాత పిండిని నూనెలో వేసి ఎర్రగా వేగించాలి. నోరూరించే మునక్కాయ పకోడి ఇక తినడమే.
